ఒకప్పుడు శంకర్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. జెంటిల్‌మెన్ మొదలుకొని రోబో వరకు ఆయన సినీ ప్రస్థానం ఎలా వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాకీ ఓ విభిన్నమైన కథాంశాన్ని, బ్యాక్‌డ్రాప్‌ని తీసుకొని థ్రిల్ చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేవాడు. అలాంటిది రోబో తర్వాత అప్పటి శంకర్ కనుమరుగైపోయాడా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే ఆ తర్వాత చేసిన ఐ, స్నేహితుడు, 2.0 చిత్రాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయే తప్ప ఏ విధంగానూ ఆకట్టుకోలేకపోయాయి. ‘భారతీయుడు’ చిత్రం సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ చేయబోతున్నాడని తెలిసి శంకర్ నుంచి మరో కళాఖండం రాబోతోందని ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు అనుకున్నంతా జరిగింది. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాడు శంకర్.
శంకర్ గత సినిమాలపై ఓ లుక్ వేస్తే.. జెంటిల్‌మెన్ నుంచి రోబో వరకు తన ప్రతి సినిమాలో పక్కాగా కథ, కథనాలు ఉండేవి. టేకింగ్ పరంగా తనకంటూ ఓ స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నాడు. సీన్స్, పాటలు, ఫైట్స్.. ఇలా ప్రతి అంశంలోనూ తనదైన మార్క్ కనిపించేలా చూసుకునేవాడు. శంకర్ సినిమాల్లో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుందన్న పేరు తెచ్చుకున్నాడు. సినిమాలో ఐదు పాటలు ఉంటే.. ఐదు ప్యాట్రన్స్‌లో ఆ పాటలు ఉండేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. డైరెక్టర్‌గా శంకర్ పతనానికి ‘భారతీయుడు 2’ పరాకాష్టగా చెప్పొచ్చు. సినిమాలో ఏ పాత్రనూ తన మార్క్ చూపించాడు.
శంకర్, మణిరత్నం సమకాలీన దర్శకులు కాకపోయినా ఒక దశలో వీరిద్దరి సినిమాలు ట్రెండ్‌గా చెప్పుకునేవారు. మణిరత్నం క్లాస్ సబ్జెక్ట్‌లతో సినిమాలు చేస్తారు. టేకింగ్ పరంగా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. మణిరత్నం డైరెక్టర్ చేసిన కొన్ని సినిమాలు విజయం సాధించకపోయినా ఆయన రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. మణిరత్నం సినిమాలకు భిన్నంగా ఉండే సినిమాలు చేసిన శంకర్ తన సినిమాల్లో గ్రాండియర్, గ్రాఫిక్స్, పాటల చిత్రీకరణలో ఓ స్పెషాలిటీ.. అన్నీ ఉండేవి. సినిమా, సినిమాకీ తన రేంజ్‌ని తగ్గించుకుంటూ వస్తున్న శంకర్‌పై ఆడియన్స్‌కి మునుపటి అభిప్రాయం ఇప్పుడు లేదన్నది స్పష్టమవుతోంది. తాజాగా చేసిన ‘భారతీయుడు2’ చిత్రంతో దాన్ని కన్‌ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఒక గొప్ప దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా రావడాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ‘గో బ్యాక్ ఇండియన్.. కమ్ బ్యాక్ శంకర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.