డైరెక్టర్ అవుతామని సినీ పరిశ్రమకు వచ్చి, హీరో అయ్యాడు న్యాచురల్ స్టార్ నాని (నాని). ‘అష్టా చమ్మా’తో హీరోగా పరిచయం కావడానికి ముందు.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హీరోగా మారిన తర్వాత డైరెక్షన్ జోలికి మాత్రం పోలేదు నాని. అయితే కథల జడ్జిమెంట్ విషయంలో మాత్రం నానిలో ఓ మంచి దర్శకుడు కనిపిస్తాడు. అందుకే ఆయన నటించిన సినిమాల్లో.. మెజారిటీ చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. అలాంటి నాని.. హీరోగా పరిచయమైన 15 ఏళ్ల తరువాత తనలోని రచయితని పరిచయం చేయబోతున్నాడు.
ఆగష్టు 29న ‘సరిపోదా శనివారం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్న నాని.. తన నెక్స్ట్ మూవీగా శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘హిట్-3’ (హిట్ 3) చేయనున్నాడు. అయితే ఈ సినిమాకి నానినే కథని అందించాడట. నిజానికి నాని ‘హిట్-3’ని కాస్త లేట్ గా చేయాలనుకున్నాడు. కానీ తనకి అదిరిపోయే స్టోరీలైన్ తట్టడంతో.. దానిని డైరెక్టర్ శైలేష్ కి చెప్పి డెవలప్ చేపించాడట. స్క్రిప్ట్ అద్భుతంగా రావడంతో.. ‘హిట్-3’ని ముందు చేయడానికి నాని నిర్ణయించుకున్నాడట.
నాని హోమ్ బ్యానర్ అయిన ‘వాల్ పోస్టర్ సినిమా’లో ‘హిట్-3’ రూపొందనుంది. ఇందులో అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి, విలన్ గా రానా దగ్గుబాటి నటించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. మరి నాని కథతో తెరకెక్కనున్న ‘హిట్-3’ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.