గ్రూప్ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్‌గా, ఆ తర్వాత హీరోగా, డైరెక్టర్‌గా ఎదిగిన రాఘవ లారెన్స్ దేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హారర్ సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన లారెన్స్‌కి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చింది కింగ్ నాగార్జున. ఒకప్పుడు సంచలన దర్శకుడు గోపాల్‌వర్మను పరిచయం చేస్తూ ‘శివ’ తన సొంత బేనర్‌లోనే నిర్మించారు. ఆ తర్వాత రాఘవ లారెన్స్‌ను ‘మాస్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా కూడా తన సొంత బేనర్‌లోనే నాగార్జున నిర్మించారు. ఈ సినిమా లారెన్స్‌కి డైరెక్టర్‌గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘స్టైల్’ అనే డాన్స్ బేస్డ్ మూవీ చేశారు లారెన్స్. అది కూడా సూపర్‌హిట్ అవ్వడంతో దర్శకుడిగానే కాదు, హీరోగా నటిస్తూ ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చారు. డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ వంటి సూపర్‌హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న ప్రభాస్ తన నెక్స్‌ట్ మూవీ కోసం ‘కాంచన’ బ్లాక్‌బస్టర్‌ని డైరెక్ట్ చేసిన లారెన్స్ అయితే పర్‌ఫెక్ట్ అనుకున్నాడు. కానీ, ప్రభాస్‌తో లారెన్స్ చేసిన ‘రెబల్’ అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
దీనితో డైరెక్టర్‌గా మూడు సంవత్సరాలు విరామం తీసుకున్నాడు లారెన్స్. తనకెంతో పేరు తెచ్చిన ‘కాంచన’ డైరెక్టర్ సీక్వెల్‌గా ‘కాంచన2’ చేశాడు. ఆ సినిమా తెలుగులో ‘గంగ’ పేరుతో రిలీజ్ అయింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ‘కాంచన3’ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కాంచన హిందీలో ‘లక్ష్మీ’ పేరుతో’ చేశాడు. ఇది కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో డైరెక్టర్‌గా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు లారెన్స్. నాలుగు సంవత్సరాలుగా అలాంటి ప్రయత్నాలు ఏమీ చేస్తున్నట్టు కనిపించలేదు. అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. అదేమిటంటే.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత డైరెక్ట్‌గా తెలుగులో ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడట లారెన్స్.
ఆ సినిమాకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ రూపొందించిన బి.కిశోర్‌రెడ్డి ఓ కథను రెడీ చేశాడట. ఆ కథను లారెన్స్‌కి చెప్పారు. లారెన్స్‌కి కథ నచ్చిందట. ఆ కథతోనే మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నాడు లారెన్స్. హాస్య మూవీస్ బేనర్‌పై రాజేష్ దండా ఈ నిర్మిస్తున్నారని. అయితే ఇది ఏ జోనర్ సినిమా, హీరోగా లారెన్సే నటిస్తాడా.. లేక మరో హీరోతో వెళతాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.