యూనివర్సల్ హీరో కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ ఇటీవల విడుదలైంది. అప్పుడు ‘భారతీయుడు’ చిత్రం బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులే ఈ సీక్వెల్‌ను తిప్పి కొట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా భారీ నష్టాన్నే చవిచూస్తోంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ‘భారతీయుడు3’ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే ‘భారతీయుడు2’లో మూడో భాగానికి సంబంధించిన 5 నిమిషాల ట్రైలర్‌ను కూడా జోడిరచారు. దాన్ని బట్టి మూడో భాగం షూటింగ్ కూడా చాలా భాగం పూర్తయిందని అర్థమవుతోంది. మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
‘భారతీయుడు2’ కారణంగా పక్కన పెట్టిన రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను మళ్లీ పట్టాలెక్కించి దాన్ని పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు శంకర్. ‘భారతీయుడు2’ రిజల్ట్ చూసిన తర్వాత చరణ్ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. తమ హీరో సినిమాని శంకర్ ఎలా తీసివుంటాడు అనే ప్రశ్న వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు శంకర్ ముందు రెండు పెద్ద టాస్క్‌లు ఉన్నాయి. ‘గేమ్ ఛేంజర్’తో హిట్ కొట్టి మెగా ఫ్యాన్స్‌ని ఖుష్ చేయాలి. అలాగే ‘భారతీయుడు2’తో నిరాశపడిన కమల్‌హాసన్ అభిమానులు, తన అభిమానులను సంతృప్తిపరచాలి. ఇప్పుడు ఈ రెండు అంశాలనే దృష్టిలో పెట్టుకొని శంకర్ వర్క్ చేస్తున్నాడని సమాచారం. ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ తర్వాత ‘భారతీయుడు3’పై దృష్టి పెట్టబోతున్నాడు. మరి శంకర్ ఈ రెండు సినిమాలను జనరంజకంగా ఎలా మలుస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.