తమిళ్ హీరోల్లో ఎక్కువ వివాదాలు ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యపై పోరాటం చేయడమో, వివాదంలో ఇరుక్కోవడమో చేస్తుంటాడు. తాజాగా ఓ కేసు విషయంలో మద్రాస్ హైకోర్టు జడ్జితో అక్షింతలు కూడా వేయించుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్, విశాల్ మధ్య ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విచారణలో భాగంగా హైకోర్టుకు హాజరయ్యాడు విశాల్. తనతో తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని, లైకా ప్రొడక్షన్స్‌తో తనకు అగ్రిమెంట్ జరిగిందనే విషయం తెలియదని న్యాయమూర్తితో వాదించాడు. విశాల్ మాటలకు ఆగ్రహించిన న్యాయమూర్తి ‘ఇది షూటింగ్’ కాదు. తెలివిగా సమాధానం చెప్పాను అనుకుంటున్నారా? సరిగ్గా చెప్పండి. లేదంటే కోర్టు ధిక్కార కేసు మీపై మోపాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. దీంతో కాస్త తగ్గిన విశాల్.. కోర్టుకు కావాల్సిన విధంగా సమాధానాలు చెప్పాడు.
లైకా సంస్థతో గత కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. అయితే ఇది ఇంతవరకు ఓలిక్కి రాలేదు. ఓ పక్క సినిమాలు చేస్తూనే ఇలాంటి వివాదాల్లో కూడా తల దూర్చుతూ ఉంటాడు విశాల్. ఈమధ్య నడిగర్ సంఘంతో కూడా సత్సంబంధాలు లేవు. అయినా ఆ సంఘ సభ్యులతో కూడా ఇటీవల ఛాలెంజ్ చేశాడు. ఎవరు ఎన్ని చెప్పినా తాను సినిమాలు తీస్తానని, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి అని ప్రకటించాడు.