‘బంట్రోతు భార్య’ చిత్రంతో నిర్మాతగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60 సినిమాలు నిర్మించారు. అందులో 40 తెలుగు సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో 90 శాతం చిరంజీవితో నిర్మించిన సినిమాలే కావడం విశేషం. తన కెరీర్ ప్రారంభం నుంచి మెగా హీరోలకే సినిమాలు చేస్తూ వస్తున్న అరవింద్ బయటి హీరోలతో చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే మొదటిసారి ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చెయ్యాలన్న కోరిక అరవింద్‌కి కలిగింది. ఆ హీరో ఎవరో కాదు సూపర్‌స్టార్ మహేష్.
మహేష్ హీరోగా నిర్మించే సినిమా కోసం ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు అరవింద్. తెలుగు వెర్షన్ వరకు తను చూసుకునే విధంగా మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఓకే అయిపోయింది. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే మహేష్ కోసం అనుకున్న కథతో అక్కడ సినిమా స్టార్ట్ అయిపోయిందట. మహేష్ కోసం అనుకున్న కథను ఎవరితో చేస్తున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. బాలీవుడ్ మేకర్స్‌తో కలిసి రామాయణ గాథను తెరకెక్కిస్తున్నట్టు గతంలో అరవింద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరో ఎవరు అనేది బయటికి రాలేదు. ఈ విషయాలను నిర్మాత బన్నివాసు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇప్పుడు సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమా షూటింగ్ ప్రారంభమైపోయింది. బన్నివాసు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రామాయణం కథతోనే మహేష్‌తో సినిమా చేయాలనుకుంటున్నారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ మేకర్స్‌తో అరవింద్ చర్చలు జరిపారని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా మహేష్‌తో సినిమా చేయాలనుకున్న అరవింద్ కోరిక తీరలేదు. ఇప్పుడీ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అరవింద్ అనుకున్నదొక్కటి, ఇప్పుడు అయ్యిందొక్కటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.