పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఇతర హీరోల అభిమానులు కూడా ప్రభాస్ అంటే ఇష్టపడతారు. అంతేకాదు, అందర్నీ డార్లింగ్ అంటూ పలకరించే ప్రభాస్ అంటే ఇండస్ట్రీలోని వారందరికీ ఇష్టమే. ప్రభాస్‌తో సినిమాలు చేసిన దర్శకులైన, తోటి నటినటులైనా అతని గురించి చాలా గొప్పగా చెప్పడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా హీరోయిన్లు డార్లింగ్ ఆతిథ్యానికి ఫిదా అయిపోతారు. శ్రద్ధా కపూర్, పూజా హెగ్డే, దీపికా పదుకొనె, శ్రుతి హాసన్, కృతిసనన్.. ఇలా ప్రభాస్‌తో కలిసి నటించిన హీరోయిన్‌లు అందరూ సందర్భం వచ్చినప్పుడు అతని ఆతిథ్యం గురించి చెబుతూ పొగడ్తలతో ముంచెత్తుతారు. ‘సలార్’ చిత్రంలో ప్రభాస్‌తో కలిసి నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ ఆమధ్య ప్రభాస్ అతిథ్యానికి ఉక్కిరిబిక్కిరి అయిపోయిందని చెప్పాడు.
తాజాగా ఆ జాబితాలో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా చేరింది. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘రాజా సాబ్’ చిత్రంలో నటిస్తోంది మాళవిక. ఈమె నటించిన ‘తంగలాన్’ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాళవిక పాల్గొంది. ఈ సందర్భంగా రాజాసాబ్ గురించి మాట్లాడుతూ ‘ప్రభాస్ సర్‌తో కలిసి నటిస్తేనే చాలు అనిపించింది. అలాంటిది ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మీ అందరిలాగే నేను రాజాసాబ్ కోసం కూడా ఉన్నాను. ఇక్కడ ప్రభాస్ సర్ గురించి ఓ విషయం చెప్పాలి. ఆయన నా కోసం ఫుడ్ పంపించారు. ఎంత టేస్టీగా ఉందంటే.. మాటల్లో చెప్పలేను. అమ్మ చేసిన ఫుడ్ తర్వాత మళ్ళీ నాకు అంతబాగా నచ్చిన ఫుడ్ ప్రభాస్ సర్ పంపించిందే. మా అమ్మ వండినట్టుగానే ఉంది. మంచి ఆతిథ్యం ఇవ్వాలంటే ప్రభాస్ సర్ తర్వాతే ఎవరైనా. ఈ విషయంలో ఆయన్ని మించినవారు లేరు. అంత మంచి ఫుడ్ పంపిన ప్రభాస్ సర్ థాంక్స్ చెబుతున్నాను’ అన్నారు.