ఒకప్పుడు టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ (పూరి జగన్నాధ్) అంటే ఒక బ్రాండ్. హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది దర్శకులలో ఆయన ఒకరు. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. హీరోలను సరికొత్తగా ప్రజెంట్ చేయడంలో ఆయన దిట్ట. అందుకే “హీరోలందు పూరి హీరోలు వేరయా” అనేవారు. అలాంటి పూరి.. కొన్నేళ్లుగా వెనుకబడిపోయాడు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పూరి జగన్నాథ్.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో హీరో యాటిట్యూడ్ కి, డైలాగ్ లకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అక్కడి నుంచి పూరి వెనుతిరిగి చూడలేదు. భారీ విజయాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, నేనింతే, బిజినెస్ మ్యాన్, టెంపర్.. ఇలా గుర్తుండిపోయే చిత్రాలను అందించాడు పూరి. హీరోలను ఆయన చూపించే తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైనా ఆ హీరో పాత్రతో ప్రేమలో పడాల్సిందే. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్ లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హీరోలతో పూరి పలికించే మాటలు.. తూటాల్లా ఉంటాయి. అయితే కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో గతంలో పూరి మార్క్ కనిపించడం లేదు.
2015లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత.. నాలుగేళ్లకు 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సక్సెస్ చూశాడు పూరి. మధ్యలో ఆరు సినిమాలు నిరాశపరిచాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా మంచి వసూళ్లతో బ్లాక్ అనిపించుకున్నప్పటికీ.. పూరి ఫ్యాన్స్ మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. అది మార్క్ సినిమా కాదని అభిప్రాయపడ్డారు. ఇక గత చిత్రం ‘లైగర్’ అయితే దారుణంగా నిరాశపరిచింది. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ కి ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన పూరి అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కమర్షియల్ గా సక్సెస్ అయితే అవుతుంది కానీ.. మాకు కావాల్సింది ఇలాంటి సినిమాలు కాదు.. బద్రి, ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి పవర్ ఫుల్ హీరో క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి పూరి నుంచి మళ్ళీ అలాంటి సినిమాలు ఎప్పుడొస్తాయో చూడాలి.