లోకనాయకుడు కమల్‌హాసన్ ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. నటుడిగా 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇంతకుముందు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాలు నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తే అలాంటి ఘనత సాధించిన రెండో నటుడిగా కమల్ కీర్తికెక్కారు. ఇప్పుడు జీవించి వున్నవారిలో 65 సంవత్సరాలు నటుడిగా కెరీర్‌ను అందుకున్నవారు ఎవరూ లేరు. 1960లో విడుదలైన ‘కలత్తూర్ కన్నమ్మ’ చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమయ్యారు కమల్‌హాసన్. ఈ సినిమా సంవత్సరం ముందే చూపించింది. అప్పుడే కమల్ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. తొలి సినిమాలోనే సావిత్రి, జెమినీ గణేశన్ వంటి లెజెండ్స్‌తో నటించే అవకాశం కమల్‌కి దక్కింది.
‘కలత్తూర్ కన్నమ్మ’ తర్వాత దాదాపు పది సినిమాల్లో బాలనటుడిగా తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నారు కమల్. నటుడిగానే కాదు, కొరియోగ్రాఫర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, గేయ రచయితగా, మేకప్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు శాఖల్లో పనిచేసిన కమల్ ఆల్రౌండర్‌గా పేరు తెచ్చుకున్నారు. యువతరానికి, రాబోయే తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా కమల్ నటప్రస్థానం సాగింది. తన నటనతో ఆబాలగోపాలాన్నీ అలరించిన కమల్ అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. కమల్ సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో మైల్ స్టోన్స్‌లాంటి సినిమాలు చేశారు. తన నటనతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తన కెరీర్‌లో మొత్తం 230 సినిమాల్లో నటించారు కమల్‌హాసన్.
‘కలత్తూర్ కన్నమ్మ’ నుంచి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ‘థగ్ లైఫ్’ చిత్రం వరకు సుదీర్ఘమైన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆగస్ట్ 12 నుంచి 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం షూటింగ్ స్పాట్‌లో ‘థగ్ లైఫ్’ చిత్ర యూనిట్ కరతాళ ధ్వనులతో తమ అభినందనలు తెలియజేశారు. చిత్ర దర్శకుడు మణిరత్నంతోపాటు యూనిట్ సభ్యులంతా వరసగా నిలబడి సెట్‌లోకి నడిచి వస్తున్న లోకనాయకుడికి తమ హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఈ అరుదైన క్షణాలను వీడియో రూపంలో ‘థగ్‌లైఫ్’ యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతటి ఘనతను సాధించిన కమల్‌హాసన్‌ను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న ‘థగ్‌లైఫ్’ చిత్రం విషయానికి వస్తే.. కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో 37 సంవత్సరాల తర్వాత రూపొందుతున్న సినిమా ఇది. 1987లో ‘నాయకుడు’ చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ జంట మళ్లీ కలిసి సినిమా చేయడానికి దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టిందంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అయితే ఇది కూడా సంచలనం సృష్టించే విధంగానే మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్‌ను పాండిచ్చేరిలో పూర్తి చేశారు. తర్వాత షెడ్యూల్‌ను కేరళలో వెంటనే స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ విడుదల కోసం ప్లాన్ చేశారు.