ఒకప్పుడు మన సినిమాలు థియేటర్లలో రికార్డులు సృష్టించేవి. రన్ పరంగా, కలెక్షన్ల పరంగా కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాలు థియేటర్ల నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వాటికి వచ్చే వ్యూస్ రాజ్యమేలుతున్నాయి. తాజాగా విజయ్ సేతుపతి సినిమా ‘మహారాజ’ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు క్రియేట్ చేసింది. కొన్ని బాలీవుడ్ సినిమాల వ్యూస్ కూడా ఈ సినిమా దాటేసింది.
విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి ఇటీవలి కాలంలో మంచి హిట్ పడలేదు. దీంతో ఎలాంటి అంచనాలు లేకుండానే ‘మహారాజ’ రిలీజ్ అయింది. ఇది విజయ్ సేతుపతి 50వ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఉంది. ఒక రొటీన్ కథను కొత్త దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ ఎంతో కొత్తగా ప్రజెంట్ చేశాడు. కూతురిపై అత్యాచారం చేసిన ఒక దొంగల గ్యాంగ్‌ను పట్టుకొని వారికి బుద్ధి చెబుతాడు ఆ తండ్రి. ఇది పరమ రొటీన్ కథ. అయినా దాన్ని ఎంతో అందంగా, అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించాడు దర్శకుడు. దీనితో థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళ్‌లోనే కాదు, తెలుగులోనూ ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. రెస్పాన్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. దేశవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాగా ‘మహారాజ’ రికార్డు క్రియేట్ చేసింది.