అప్పటివరకు ఓ ఫార్ములాలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినిమా దశ, దిశ మార్చిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ‘శివ’ వంటి సంచలన చిత్రంతో తెలుగు సినిమాకి ఓ కొత్త ఫార్మాట్‌ని పరిచయం చేసి ఆ తరహా సినిమాలు మరిన్ని రావడానికి దారి చూపించారు. ఆ తర్వాత వర్మ శిష్యుడు కృష్ణవంశీ తనదైన స్టైల్‌లో ‘గులాబి’ చిత్రంతో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక సినిమాకి, ఒక సినిమాకి సంబంధం లేని విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడం ద్వారా కృష్ణవంశీ ఆ విధంగా తనకంటూ ఒక స్టైల్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఇక 2000వ దశకంలో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన పూరి జగన్నాథ్ ఓ విలక్షణమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. పవన్‌కళ్యాణ్‌తో చేసిన తొలి సినిమా ‘బద్రి’ ఘనవిజయం. ఆ తర్వాత టాలీవుడ్‌లోని అందరు టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూరి తెలుగు హీరోలకి ఒక కొత్త ఎలివేషన్, కొత్త మేనరిజాన్ని క్రియేట్ చేశారు.
‘బద్రి’ నుంచి ఇటీవల వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ వరకు పూరి టచ్ చేసిన సబ్‌క్ట్‌లన్నీ విభిన్నంగానే దర్శకుడిగా సక్సెస్ శాతం తక్కువగానే చెప్పాలి. అతని కెరీర్‌లో కొన్ని బ్లాక్‌బస్టర్స్, కొన్ని ఏవరేజ్ సినిమాలు, కొన్ని ఫ్లాప్‌లు ఉన్నాయి. 2014లో వచ్చిన ‘టెంపర్’ తర్వాత పూరి చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. 2019లో ‘ఇస్మార్ట్ శంకర్’ డైరెక్టర్‌గా అతనికి కొత్త ఉత్సాహాన్ని అందించారు. ఆ తర్వాత ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య విజయ్ దేవరకొండతో చేసిన ‘లైగర్’ తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక పూరి పనైపోయింది అనే లెవల్‌లో కామెంట్స్ రావడానికి ఆ సినిమా కారణమైంది. దాని నుంచి బయట పడేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. తనకు చాలా కాలం తర్వాత హిట్‌నిచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’నే నమ్ముకున్నాడు. దానికి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ స్వీయ నిర్మాణంలో రూపొందించారు. ఇది డైరెక్టర్‌గా తనను నిలబెట్టే సినిమా అవుతుందని ఆ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలవడంతో పూరి ఆలోచనలో పడ్డారు.
వరస ఫ్లాపుల నేపథ్యంలో ఎంతో కసితో చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా అతని అంచనాలను చేరుకోలేకపోయింది. నిజానికి ఇస్మార్ట్ శంకర్‌తో తాజా సీక్వెల్‌లో అంత స్టఫ్ లేదనేది వాస్తవం. ఇస్మార్ట్ శంకర్‌కి మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. కానీ, అదే మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్’ మైనస్ అయ్యాడు. పూరిలాగే మణిశర్మ కూడా తన కెరీర్‌ను ముగించే దిశగా వున్నట్టు ఈ సినిమాకి మణి చేసిన మ్యూజిక్‌ని చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్‌తో ఓ పక్క పూరి, మరో పక్క మణిశర్మ దిక్కుతోచని స్థితిలో ఉంది.
టాలీవుడ్‌లో ఉన్న అందరు టాప్ హీరోలతో పూరి సినిమాలు చేశారు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితిలో ఏ హీరో కూడా ధైర్యం చేసి ముందుకొచ్చే అవకాశం లేదు. తెలుగు సినిమా ఇప్పుడున్న పరిస్థితిలో ఏ సినిమా సూపర్‌హిట్ అవుతుంది, ఏది డిజాస్టర్ అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌లో మహామహులే మట్టికరిచారు. అలాంటిది వరస ఫ్లాపులతో సతమతమవుతున్న పూరిని చేరదీసే హీరో ఎవరు? ఒకవేళ ఏ హీరో అయినా డేట్స్ ఇచ్చినా తన సొంత బేనర్‌లోనే సినిమా చేయాలి. కానీ, ఇప్పుడు తన నిర్మాణ సంస్థకు ఆర్థికంగా అంత కెపాసిటీ లేదు అనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో బయట నిర్మాతలు పెట్టుబడి పెట్టేందుకు ఎలా వస్తారు? ఇప్పట్లో పూరి సినిమా చేసే అవకాశం కనిపించడం లేదు. ‘డబుల్ ఇస్మార్ట్’ రిజల్ట్ చూసిన తర్వాత ఇక పూరి కెరీర్‌కి ఎండ్ కార్డ్ పడినట్టే అంటూ వినిపిస్తున్న మాటల్లో నిజం లేకపోలేదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లను చూసిన పూరి.. మళ్లీ డైరెక్టర్‌గా తనని తాను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ చేస్తే ఏ తరహా సినిమా చేస్తారు? ఎవరి నిర్మాణంలో చేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే వెంటనే వెయిట్ చెయ్యక తప్పదు.