ఏ సినిమాకైనా కథే హీరో అంటారు. మంచి కథ ఉంటే దాన్ని నడిపించడానికి మంచి కథనం కూడా తోడవుతుంది. దానితోపాటే ఆకట్టుకునే సంభాషణలు కూడా కుదురుతాయి. ఒకప్పుడు తెలుగు సినిమాలు ఒరిజినల్ కథలతోనే రూపొందించబడ్డాయి. రాను రాను కథల కొరత ఏర్పడటంతో ఇతర భాషా చిత్రాల కథలపై దృష్టి పెట్టారు మన రచయితలు. 80వ దశకం నుంచి హాలీవుడ్ సినిమాలు, ఆ తర్వాత కొరియన్ సినిమాల కథల పట్ల ఆసక్తి పెరగడంతో ఆ సినిమాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కథలు తయారు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాతి కాలంలో అలాంటి సినిమాల ఒరవడి బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే సినిమా కథను తీసుకొని కథలు రెడీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఓ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని తెలుగులో నాలుగు సినిమాలు రూపొందించబడ్డాయి. వాటిలో ఒకటి తమిళ్‌లో రూపొందించిన సినిమా అయినా తెలుగులో కూడా ఘనవిజయం. ఆ హాలీవుడ్ సినిమా పేరు ‘యాన్ ఇన్నోసెంట్ మ్యాన్’.
2006లో రవితేజ హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా వచ్చిన ‘షాక్’ రామ్‌గోపాల్‌వర్మ నిర్మించగా, ఆయన శిష్యుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమాయకుడైన హీరోని పొరపాటున ఒక కేసులో ఇరికిస్తారు ఇద్దరు పోలీస్ అధికారులు. ఒక టెర్రరిస్టుగా చిత్రీకరిస్తారు. ఒకరిని పట్టుకోవడానికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్లు డోర్ నెంబర్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయి హీరోని అరెస్ట్ చేస్తారు. తర్వాత తప్పు తెలుసుకున్న ఆ ఆఫీసర్లు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రకరకాల సాక్ష్యాధారాలు సృష్టించి అతనే నేరస్తుడు అని ప్రూవ్ చేసి జైలుకి పంపిస్తారు. అతను నిర్దోషి అని నిరూపించేందుకు భార్య పోరాటం మొదలు పెడుతుంది. ఇది కథ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన మనోహరం కూడా ఇదే కాన్సెప్ట్‌తో రూపొందించబడింది. అలాగే నరేష్ హీరోగా, శోభన’గా మౌళి దర్శకత్వంలో 1992లో వచ్చిన హలో డార్లింగ్ లేచిపోదామా అనే సినిమాని పోలి ఉందని కూడా కామెంట్స్ వచ్చాయి. అప్పట్లో ఈ సినిమా టైటిల్‌పై కొంత వివాదం కూడా నడిచింది. టైటిల్ చివర వున్న లేచిపోదామా అనేది చాలా వల్గర్‌గా ఉందని మహిళా సంఘాలు కూడా ధర్నాలు చేశాయి. ఆ తర్వాత హలో డార్లింగ్ పేరుతో సినిమా రిలీజ్ చేశారు. అయితే ఇది కూడా విజయం సాధించలేదు.
ఇదిలా ఉంటే.. 1992లోనే వచ్చిన మరో సినిమా రోజా. మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఒకప్పుడు తమిళనాడుకి చెందిన ఒక ఇంజనీర్‌ను టెర్రరిస్టులు కిడ్నాప్ చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రోజా రూపొందించారని అంటారు. అయితే ఈ సినిమాలో కూడా అమాయకుడైన భర్తను టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే భార్య అతన్ని రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మనోహరం చిత్రంలో కూడా డోర్ నెంబర్ కన్‌ఫ్యూజన్ కారణంగానే హీరోని కేసులో ఇరికిస్తారు. ఈ నాలుగు సినిమాల మధ్య ఎన్నో పోలికలు కనిపిస్తాయి. అలా కనిపించడానికి కారణమైన హాలీవుడ్ సినిమా పేరు ‘యాన్’ ఇన్నోసెంట్ మ్యాన్’.
1989లో పీటర్ ఏట్స్ దర్శకత్వంలో రూపొందించిన ‘యాన్ ఇన్నోసెంట్ మ్యాన్’ హాలీవుడ్‌లో ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఎయిర్‌లైన్స్‌లో ఏరోనాటిక్ ఇంజనీర్‌గా పనిచేసే ఒక సాధారణ వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక డ్రగ్ రాకెట్‌లో నిందితుడ్ని పట్టుకునేలా పొరపాటున హీరోని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అతనే నిందితుడు అని ప్రోత్సహించడానికి దొంగ సాక్ష్యాలను ప్రవేశపెట్టి అతన్ని జైలుకి పంపిస్తారు. తను నిర్దోషినని ప్రూవ్ చేసుకొని హీరో ఎలా బయటికి వచ్చాడనేది కథ. ఈ కథని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించిన ఈ నాలుగు సినిమాల్లో రోజా మాత్రమే ఘనవిజయం స్ఫూర్తిగా రూపొందింది.