నటసింహ నందమూరి బాలకృష్ణ.. అతను కళ్లెర్రజేస్తే అరాచక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. తొడగొడితే దిక్కులు పెక్కటిల్లుతాయి. సింహంలా గర్జిస్తూ డైలాగులు చెబితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. నటరత్న నందమూరి తారక రామారావు తర్వాత అలాంటి ఇమేజ్‌ని సొంతం చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఈతరం హీరోల్లో పౌరాణిక, జానపద చిత్రాల్లోని పాత్రల్ని పోషించగల ఏకైక కథానాయకుడు ఈ నందమూరి నటవారసుడు.
‘తాతమ్మ కల’ చిత్రంతో ప్రారంభమైన బాలకృష్ణ సినీ ప్రస్థానం నిరాటంకంగా నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. వారసత్వంగా వచ్చిన తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్న బాలయ్య తన కెరీర్‌లో ఎన్నో అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు. రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ జనరేషన్‌లో ఎంత మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి వచ్చినా.. వారికి గట్టి పోటీ ఇస్తూనే ఎన్నో ఘనవిజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.
50 ఏళ్ళ సినిమా కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ చేయని పాత్రంటూ లేదు. నవరసాల్లో ఏ రసన్నయినా అవలీలగా పోషించిన ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా కలిగిన పరిపూర్ణ నటుడు బాలకృష్ణ. తండ్రి ఎన్.టి.రామారావునే ఆదర్శంగా తీసుకున్న బాలయ్య ఆయన మార్గంలోనే వ్యక్తిగత జీవితాన్ని, సినీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అదే క్రమశిక్షణను పాటిస్తూ దర్శకనిర్మాతల హీరోగా పేరు తెచ్చుకుంటున్నారు బాలకృష్ణ. వృత్తి పట్ల తనకు ఉన్న నిబద్ధత ఎంతో మంది యువ నటిలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని, తన క్యారెక్టర్ ఎందరికో ఆదర్శంగా నిలిచేదిగా ఉండాలనేది బాలయ్య అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే సినిమాలు ఎంపిక చేసుకుంటూ ట్రెండ్‌కి అనుగుణంగా ఉండే సినిమాలే చేస్తున్నారు. గత ఏడాది ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ చిత్రాలతో ప్రేక్షకులను చైతన్య పరిచిన బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. బోయపాటి శ్రీనుతో సింహా, లెజెండ్, అఖండ వంటి భారీ విజయాలను అందుకొని హ్యాట్రిక్ సాధించారు. అఖండతో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య దానికి సీక్వెల్‌గా రూపొందించబడిన అఖండ2తో మరో బ్లాక్‌బస్టర్ కోసం రంగం సిద్ధం చేసుకున్నారు.