నటీనటులు: రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు, మంజునాథ్
బ్యానర్: చిమటా ప్రొడక్షన్స్
ఫైట్స్: నూనె దేవరాజ్,
సినిమాటోగ్రఫీ; కె.రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎం.ఎల్.రాజా
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
విడుదల తేది: ఆగస్టు 30, 2024
ఇటీవల కాలంలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం “నేను – కీర్తన”. స్వయంగా కథ – మాటలు – స్క్రీన్ ప్లే సమకూర్చుకుని.. చిమట రమేష్ బాబు డైరెక్టర్ కమ్ రూపొందించిన ఈ చిత్రం నేడు (ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
తన కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ, ఆపదలో ఉన్న వారి కోసం ప్రాణాలు పణంగా పెట్టి అరాచకాలకు ఎదురొడ్డే జానీ అనే ఓ యువకుడి కథ “నేను కీర్తన”. జానీ జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశించాక… అతని జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది, తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా… సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా వినియోగించుకున్నాడనే కథ.
విశ్లేషణ:
మల్టీ జోనర్ ఫిల్మ్ గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలన్స్ చేసిన తీరు అభినందనీయం. అయితే… ఒక చిన్న సినిమాలో ఇన్ని జోనర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అక్కడక్కడా అనిపించినా… కథ మలుపులు తిరిగేకొద్దీ రక్తి కట్టిస్తుంది.
దర్శకుడిగా మంచి మార్కులు స్కోర్ చేసిన రమేష్ బాబు.. రైటర్ గా ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. కొన్ని డైలాగ్స్ మరీ హెవీ అయ్యాయేమో అనిపించింది. అలాగే… ముందే చెప్పుకున్నట్టు ఒక సినిమాలో అన్ని జోనర్లు చెప్పుకోవడం అవసరమా అనిపిస్తుంది. ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా… ల్యాగ్ అనిపించకుండా సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే మరింత బాగుండేది. బడ్జెట్ పరిమితులు దృష్టిలో పెట్టుకుంటే కెమెరా వర్క్ బాగానే ఉంది. ఎం.ఎల్.రాజా నేపధ్య సంగీతం బాగుంది. ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్, కులు మనాలిలో చిత్రీకరించిన పాట, పోరాటాలు ఈ చిత్రాల ప్రధాన ఆకర్షణలు.
నటీనటుల పనితీరు:
హీరో రమేష్ బాబు తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. నటనతో ఆకట్టుకోవడమే కాకుండా.. పోరాటాలు, నృత్యాల్లో కూడా రాణించాడు. కాకపోతే, రైటర్, డైరెక్టర్ కూడా తనే అయిన రమేష్ బాబు… పెద్ద హీరోలకయితే బ్రహ్మాండంగా పేలే డైలాగ్స్ రాసుకున్నాడు. అలాగే యాక్షన్ బ్లాక్స్ కూడా. విజయ రంగరాజు, జీవాల విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? బ్రహ్మాండంగా రక్తి కట్టించారు. జబర్దస్త్ అప్పారావు కామెడీ బాగానే పండింది. కొత్తవాళ్ళయినా హీరోయిన్లు రిషిత, మేఘన తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. రేణు ప్రియ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది.
ఫైనల్ గా…
చిన్న చిన్న లోపాలున్నప్పటికీ ‘నేను – కీర్తన’ చిత్రం మంచి ప్రయత్నమే.
రేటింగ్: 2.5/5