పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటివరకు పవర్‌స్టార్‌కు వున్న రేంజ్‌ని ఒక స్థాయికి తీసుకెళ్లిన సినిమా అది. సెప్టెంబర్ 2న పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్‌సింగ్’ చిత్ర రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ ఇంకా కొందరు యూనిట్ సభ్యులు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బండ్ల గణేష్ ‘గబ్బర్‌సింగ్’ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన గురించి తెలిపారు. ‘ఈ సినిమా షూటింగ్ గుజరాత్‌లో జరుగుతున్న సమయంలో పవన్‌కళ్యాణ్‌గారికి పెద్ద ప్రమాదం తప్పింది. గుర్రాన్ని రైడ్ చేస్తున్న సమయంలో దాని పైనుంచి స్లిప్ అయి పడబోయారు. కానీ, ప్రమాదం తప్పింది. అలాగే కింద పడి ఉంటే ఆయన మనకు దక్కేవారు కాదు. ఆ క్షణం మేమంతా ఎంతో భయపడ్డాం. గబ్బర్‌సింగ్ రిలీజ్ సమయంలో ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా అదే క్రేజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఏడేళ్ళుగా నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నాను. త్వరలోనే మా పరమేశ్వర ఆర్ట్స్‌లో ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తాను. హరీష్ శంకర్, పూరి జగన్నాథ్‌లతో బ్లాక్‌బస్టర్ హిట్స్ తీస్తాను’ అన్నారు.