హైదరాబాద్ లోని చెరువులు, నాళాలు ఆక్రమించి ఎందరో అక్రమ కట్టడాలు కట్టారు. దీంతో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. అందుకే ఆ అక్రమ కట్టడాలకు అడ్డు కట్ట వేసి, హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా తక్కువ టైంలోనే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులకు చెందిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తూ దూకుడు చూపిస్తోంది. ముఖ్యంగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రా పేరు మారుమోగిపోయేలా చేసింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ హైడ్రాను తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మెచ్చుకోవడం విశేషం.
ప్రస్తుతం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన నాగబాబు.. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు.
“వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి, లకి నీళ్లు రావడం, కొన్ని సామాన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్. సాహసోపేత నిర్ణయాలకు, ప్రశంసనీయమైన నిర్ణయాలకు పనికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిద్దాం.పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది…..” అంటూ నాగబాబు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.