నటసింహ నందమూరి బాలకృష్ణ.. 80వ దశకం నుంచి ఇప్పటివరకు హీరోగా కొనసాగుతున్న ప్రేక్షకుల మనసుల్లో తిరుగులేని వాటిని దక్కించుకున్న నటుడు. తెలుగు చలనచిత్ర సీమలో నటుడిగా ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ అయన్ను ఘనంగా సన్మానించింది. దక్షిణభారత చిత్ర సీమకు చెందిన ఎందరో అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరైన నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేసారు. బాలకృష్ణ సమకాలీనుడైన మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో ప్రసంగిస్తూ నందమూరి హీరో గురించి చెప్పిన మాటలు, ఆయన అందించిన ప్రశంసలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. నందమూరి నటసింహం గురించి మెగాస్టార్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘మా బాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వేడుకలో మేమంతా పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది కేవలం బాలయ్య నట జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న వేడుక కాదు. సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుకగా నేను భావిస్తున్నాను. నందమూరి తారక రామారావుగారి శత జయంతి ఉత్సవాలు సంవత్సరంలోనే బాలకృష్ణగారి 50 సంవత్సరాల వేడుక జరగడం అన్నది గొప్ప ఫీట్. ఎప్పుడోగానీ జరిగే అరుదైన వేడుక ఇది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావుగారు మహానటుడు, మహానుభావుడు. ఆయన చేయని పాత్రలు లేవు. పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా.. పాత్ర ఏదైనా దానికి జీవం పోసేవారు. అలాంటి నటుడి వారసుడిగా బాలకృష్ణగారు కూడా రామారావుగారు చేసిన పాత్రల ధీటుగా చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. 50 సంవత్సరాల పాటు నటుడిగా తన ప్రస్థానాన్ని సాగించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికీ హీరోగా బాలకృష్ణగారు ఇంకా కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్నారు. రాబోయే రోజుల్లో 75 ఏళ్ళ వేడుక కూడా జరుపుకుంటారు. అప్పుడు కూడా మనమంతా వస్తాము. దానికి ఆయనకు ఆయురారోగ్యాలు భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.