నటసింహ నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఇండస్ట్రీలోని నటినటుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అందరం సోదరుల్లా మసలుకుంటామని స్పష్టం చేశారు. అలాగే బాలకృష్ణ చేసిన, చేస్తున్న సినిమాల గురించి కూడా మెగాస్టార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘నందమూరి తారక రామారావుగారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా.. ఇలా ఎన్నో మరపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఆ తరహాలోనే బాలకృష్ణ కూడా ఆ పాత్రల్ని పోషించి తర్రడికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అయితే రామారావుగారు పాత్రలు కూడా బాలకృష్ణ చేశారు. అదేమిటో తెలుసా.. ఫ్యాక్షన్ పాత్రలు. కత్తి తీసుకొని నరుకుతూ పోతే తలలు తెగాల్సిందే. అలాంటి ఓ ఎడ్జ్ తీసుకొని ఆ పాత్రలు పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు బాలకృష్ణ. నేను ఇంద్రసేనారెడ్డి పాత్ర చేయడానికి ఒకరకంగా సమరసింహారెడ్డే ఇన్‌స్పిరేషన్. ఇప్పటికే బాలకృష్ణగారు అలాంటి కొన్ని పాత్రలు చేసారు. ఆ సమయంలో నాకు అలాంటి పాత్ర వచ్చినప్పుడు నేను కాస్త జంకిన మాట వాస్తవం. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. అలాంటిది ఆ పాత్ర నేను చేసి మెప్పించాలంటే ఎలా.. అంటూ ఎన్నో తర్జనభర్జనలు పడ్డాను. ఎస్.. నేను చెయ్యాలి అనేలా ఆ పాత్ర, కంటెంట్ నన్ను ఇన్‌స్పైర్ చేశాయి. ఆ సినిమాని కూడా ఆదరించి మీరంతా మంచి విజయాన్ని అందించారు.
దీని గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఏ సినిమాకైనా సీక్వెల్, ప్రీక్వెల్, నంబర్ 1, నంబర్ 2 అంటూ సినిమాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరైనా రైటర్స్ ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్‌ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చెయ్యమంటే నేను రెడీ.. మరి బాలయ్య అంటూ మీరు అడిగినంత ఉత్సాహంగా బాలకృష్ణ కూడా ‘నేను కూడా రెడీ..’ అన్నారు. అలా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అంటూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అది విని అందరితోపాటు చప్పట్లు కొడుతున్న బోయపాటిని ఉద్దేశించి ‘ఏం బోయపాటి ఉత్సాహంగా చప్పట్లు కొడుతున్నావ్. ఛాలెంజ్ విసిరాను. తీసుకో. చాలా మంది కథలకు ఇది చెప్పాను. పక్కనే చౌదరి కూడా ఉన్నాడు. ఏమో ఎవరి మనసులో నుంచి ఎలాంటి ఆలోచన వస్తుందో.. అలాంటి సినిమా చేయాలని ఉత్సాహంగా ఉంది’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి.