సినిమాల్లో ఎంతో ఆదర్శవంతమైన పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యే నటినటులు అప్పుడప్పుడు తమ సేవా నిరతిని కూడా ప్రదర్శిస్తుంటారు. అలాంటి హీరోల్లో సుప్రీమ్ హీరో సాయిదుర్గతేజ్ ఒకరు. గతంలో ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా తన మంచి మనసుని చాటుకున్న సాయిదుర్గతేజ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులను చూసి చలించిపోయారు. తనవంతు సాయంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తన వంతుగా రూ.20 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ సహాయాన్ని అందించారు.
తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు తేజ్. విజయవాడలోని ఓల్డేజ్ హోమ్ అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థను సందర్శించారు. మొదట విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్లారు. అక్కడన్న వృద్ధులను ఎంతో ప్రేమగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థకు రూ.2 లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ.3 లక్షల విరాళాన్ని అందించారు.
అమ్మ ఆశ్రమానికి సొంత భవనం కట్టిస్తానని 2019లో తన పుట్టినరోజున మాటిచ్చిన సాయి దుర్గతేజ్…చెప్పినట్లుగానే 2021లో బిల్డింగ్ కట్టించి ఇచ్చారు. మూడేళ్ల పాటు అమ్మ అనాథాశ్రమాన్ని దత్తత తీసుకుని మొత్తం ఖర్చులన్నీ భరించారు. సాయి దుర్గతేజ్ మంచి మనసుకు ఆశ్రమవాసులతో పాటు ప్రజలందరి ప్రశంసలు దక్కాయి. మేనమామ, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి సేవా గుణాన్ని పుణికి పుచ్చుకున్న సాయి దుర్గతేజ్ భవిష్యత్‌లోనూ తనకు ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి అండగా నిలుస్తున్నారని ఆశ్రమంలో వృద్ధులు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.