తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. (గురు చరణ్)
గురుచరణ్ రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. అందులో “ముద్దబంతి నవ్వులో మూగబాసలు”, “బోయవాని వేటుకు గాయపడిన కోయిల” లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై తెలుగునాట సంచలనం సృష్టించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో కూడా గురుచరణ్ ఒక పాట రాశారు. ఈ సినిమాలో ఆయన రాసిన ‘ఏరువాక సాగారో’ పాట విశేషంగా ఆకట్టుకుంది.
గురుచరణ్ మృతి పట్ల తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సంతాపం ప్రకటించారు. తాము నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రంలో ‘ఏరువాక సాగారో’ అనే అద్భుతమైన పాటను రాశారని గుర్తుచేసుకున్నారు. గీత రచయితగా సినీ పరిశ్రమకు గురుచరణ్ గారు చేసిన సేవను ఎప్పటికీ మరిచిపోలేమని అన్నారు. గురుచరణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అన్నారు.