నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తర్వాత మళ్ళీ అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సింగర్ మనో. సింగర్‌గానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా మనో ఎంతో పాపులర్. ముఖ్యంగా తెలుగులో రజినీకాంత్‌కి మనో వాయిస్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇప్పటివరకు 11 భాషల్లో 30,000కు పైగా పాటలు పాడిన మనో ఎప్పుడూ వివాదాల్లోకి రాలేదు. ఎవరిపైనా ఎలాంటి కామెంట్స్ చేసిన సందర్భాలు కూడా లేవు. తన పని తాను చేసుకుంటూ వెళ్లడం తప్ప ఒకరి జోలికి వెళ్ళని మనోకు ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గౌరవాన్ని తెచ్చుకున్న మనో కొడుకుల వల్ల రచ్చకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. తన ఇద్దరు కుమారులు రఫీ, షకీర్ హత్యాయత్నం కేసులో ఇరుక్కున్నారు. వీరిద్దరిపైనా పోలీసులు పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రఫీ, షకీర్‌లకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలేం జరిగిందంటే వివరాల్లోకి వెళితే..
చెన్నయ్‌లోని ఆలప్కాక్కానికి చెందిన కృపాకరన్(20), వళసరవాక్కం శ్రీదేవి(16) కుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. మంగళవారం వారిద్దరూ అకాడమీ నుంచి తిరిగి వస్తూ.. దారిలో ఉన్న ఓ హోటల్‌లో టిఫిన్ కోసం ఆగారు. ఆ సమయంలో రఫీ, షకీర్‌లతోపాటు వారి స్నేహితులు ముగ్గురు అక్కడ ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు.. ఆ ఇద్దరు కుర్రాళ్ళతో ఏదో విషయంలో ఘర్షణకు దిగారు. కాస్త పెద్దది కావడంతో ఐదుగురు స్నేహితులు వారిపై దాడి చేశారు. ఆ కృపాకరన్ ఇద్దరిలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న వళసరవాక్కం పోలీసులు.. రఫీ, షకీర్, విఘ్నేష్, ధర్మ, జహీర్‌లపై హత్యాయత్నం, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారిలో మనో కుమారులు కూడా ఉన్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.