ఇటీవలి కాలంలో యూట్యూబ్ ఛానల్స్‌లో ఎంత పని చేస్తున్నారో.. ఏ చిన్న ఇష్యూనా దాన్ని వెంటనే తమ ఛానల్‌లో ఓ ప్రోగ్రామ్ చేసేయాలి అనే ఆరాటంలో నిజానిజాలు తెలుసుకోకుండా రంగంలోకి దిగుతున్నారు. అయితే చాలా వరకు కలెక్ట్ చేసిన న్యూస్ కరెక్టే అయినా కొన్ని సార్లు మాత్రం తప్పులో కాలేస్తున్నారు. అలాంటి ఓ విచిత్రమైన అంశం ఈమధ్య హీరోయిన్ సాయి పల్లవి విషయంలో జరిగింది. సాయిపల్లవికి తెలుగు రాకపోయినా, నేర్చుకొని తన క్యారెక్టర్‌కి తానే డబ్బింగ్ చెబుతోంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన ఫిదా చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్స్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు, డబ్బింగ్ చెబుతున్నప్పుడు స్టూడియోలో చేసిన ఓ వీడియో కూడా అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి డబ్బింగ్ చెప్పింది తానేనంటూ ఆద్య హనుమంతు అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. సాధారణంగా పాటల రికార్డింగ్‌కి సంబంధించి ఒక ట్రాక్ సింగర్‌తో ఆ పాటను పాడతారు. ఒరిజినల్ సింగర్ ఆ ట్రాక్ విని తన స్టైల్‌లో పాడేందుకు ట్రై చేస్తారు. సాయిపల్లవికి తానే డబ్బింగ్ చెబుతాను అంటూ వచ్చిన వ్యక్తి కూడా మొదట ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలుగులో ట్రాక్ డబ్బింగ్ చెప్పేవాడినని తెలియజేశాడు. అంతేకాదు, కన్నడలో డబ్బింగ్ వెర్షన్‌కి సాయిపల్లవికి డబ్బింగ్ చెప్తానంటున్నాడు. ట్రాక్ సింగర్‌లా తాను ట్రాక్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. కానీ, కొన్ని యూ ట్యూబ్ ఛానల్ మాత్రం అతనే ఒరిజినల్‌గా డబ్బింగ్ చెబుతాడంటూ థంబ్ నెయిల్స్ పెట్టడంతో ఈ విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది.
దీనితో మిగిలిన యూట్యూబ్ ఛానల్ అన్నీ అతనిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడుతోంది. ఆ క్రెడిట్ తీసేసుకున్నాడు హనుమంతు. నిజానికి అతను ఇంటర్వ్యూల్లో చెప్పిన డైలాగ్స్‌కి, సినిమాలో మనం విన్న సాయిపల్లవి వాయిస్‌కి ఎక్కడా పొంతన లేదు. అయినా దాన్నే ప్రొజెక్ట్ చేస్తూ అతనికి మరింత పబ్లిసిటీ ఇచ్చే పనిలో ఉంది మీడియా. దీనికి తోడు కొన్ని ఛానల్స్‌లో కూడా అతన్ని హైలైట్ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది.
గత కొంతకాలంగా సాయిపల్లవి డబ్బింగ్ విషయంలో ఇంత రచ్చ జరుగుతోంది.. సాయిపల్లవిగానీ, ఆమె చేసిన సినిమాలకు సంబంధించిన యూనిట్ మెంబర్స్‌గానీ ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు, మిగిలిన డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఇప్పటివరకు నోరు విప్పలేదు. వాళ్ళ మౌనం చూస్తుంటే ఆద్య హనుమంతు అనే వ్యక్తి చెప్పేది నిజమేనా.. ఇంతకాలం తానే డబ్బింగ్ చెబుతున్నానంటూ సాయిపల్లవి ప్రేక్షకుల్ని మోసం చేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇప్పటికే అతని ఇంటర్వ్యూలు యూ ట్యూబ్‌లో చాలా వచ్చాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద చర్చే. ఆద్య హనుమంతు అనే వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని, సినిమాలో మనకు వినిపిస్తున్న సాయి పల్లవి వాయిస్‌కి, అతను ఇంటర్వ్యూల్లోని అతని వాయిస్‌కి సంబంధమే లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డబ్బింగ్’ పేరుతో ఇదో తరహా మోసం జరుగుతోంది అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.