అల్లు అర్జున్‌కి, మెగా ఫ్యామిలీకి మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది కొత్త మలుపులు తిరుగుతూ వస్తోంది. ఆమధ్య జరిగిన ఎన్నికలలో పవన్‌కళ్యాణ్‌ని సపోర్ట్ చెయ్యకుండా, వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా వీరి మధ్య వున్న వివాదం మరింత పెరిగింది. బన్నీ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య నిరంతరం సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది. ఒక దశలో అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప2 రిలీజ్‌కి మెగా ఫ్యాన్స్ అడ్డుపడతారేమో అన్నంతగా వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. గురువారం ఈ సినిమా విడుదల అవుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో మెగా బ్రదర్ నాగబాబు ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసేందుకు ఓ ట్వీట్ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా మెగా అభిమానులను సంయమనం పాటించాలని నిర్ణయించారు. ఓ పక్క సాయిధరమ్‌తేజ్ కూడా సినిమా సూపర్‌హిట్ అవ్వాలని ట్వీట్ చేశాడు.
ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తుంటే ఈ వివాదానికి ముగింపు పలికేందుకు అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నాడని, మెగా ఫ్యామిలీతో కలిసిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ, అది నిజం కాదని ‘పుష్ప2’ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. ఈ సినిమాలో ఒక డైలాగ్ వల్ల మెగా ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు. ఈ పరిణామంతో మెగా ఫ్యాన్స్ ప్రత్యక్ష యుద్ధానికి దిగినా ఆశ్చర్యం లేదు. ‘పుష్ప2’ సినిమా స్టార్టింగ్‌లో అల్లు అర్జున్ చెప్పిన ఆ డైలాగ్.. ‘ఎవడ్రా బాస్…? ఎవడికిరా బాస్? ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్’.. ఈ డైలాగ్ చిరంజీవి, రామ్‌చరణ్, పవన్‌కళ్యాణ్‌లను ఉద్దేశించి పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే సినిమా ఇండ్రస్టీలో మెగాస్టార్ చిరంజీవిని బాస్ అని పిలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్‌తో చిరంజీవి ఫ్యామిలీని అల్లు అర్జున్ టార్గెట్ చేశారనేది వాస్తవం. ఈ డైలాగ్ పెట్టడంపై మెగా అభిమానులు రగిలిపోతున్నారు. ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మెగాన్స్ ఎలాంటి చర్యలకు దిగుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద రచ్చ.
ఈ సినిమా విడుదల ముందు వరకు జరిగిన పరిణామాలను చూస్తే చిరంజీవి, నాగబాబు, పవన్‌కళ్యాణ్ సమసిపోతుంది అనుకున్న సమస్యను సినిమాలో తన డైలాగ్‌తో మెగా ఫ్యామిలీని, మెగా ఫాన్స్‌ని రెచ్చగొట్టినట్టయింది. మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.