తక్కువ సమయంలో వరుసగా స్టార్స్ తో సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న దర్శకుల్లో బాబీ కొల్లి ఒకరు. పలు చిత్రాలకు రచయితగా పని చేసి మంచి గుర్తింపు పొందిన బాబీ, 2014లో రవితేజ హీరోగా వచ్చిన ‘పవర్’ సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యాడు. దర్శకుడిగా మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రూపంలో రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించాడు. కానీ ఆ మూవీ దారుణంగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. అదే జోష్ లో వెంకటేష్ తో ‘వెంకీ మామ’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ చేసి విజయాలు అందుకొని హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ‘డాకు మహారాజ్’ను రూపొందించాడు. (డాకు మహారాజ్)
టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా బాబీకి మంచి పేరు వచ్చింది. ‘డాకు మహారాజ్’కి ముందు ఐదు సినిమాలు డైరెక్ట్ చేయగా, అందులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తప్ప మిగిలిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు ‘డాకు మహారాజ్’పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ వస్తే.. దర్శకుడు బాబీ మరో భారీ విజయాన్ని అందుకున్నట్లే.
‘డాకు మహారాజ్’ అనేది హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాబీ డైరెక్ట్ చేసిన సినిమా మాత్రమే కాదు. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కూడా. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి మూడు భారీ విజయాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రమిది. మరి హ్యాట్రిక్ హీరో బాలకృష్ణతో హ్యాట్రిక్ డైరెక్టర్ బాబీ చేసిన ఈ మూవీ వరుసగా నాలుగోసారి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.