సినిమా పేరు:సంక్రాంతికి వస్తున్నాం
నటీనటులు:వెంకటేష్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, నరేష్, వీటీ గణేష్, సాయి కుమార్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ,మురళిగౌడ్
రచన,దర్శకత్వం: అనిల్ రావిపూడి
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
సంగీతం: భీమ్స్ సిసిరిలియో
నిర్మాత: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల తేదీ: 14 -01 – 2025
మూడున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో తిరుగులేని కథానాయకుడిగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న విక్టరీ వెంకటేష్ సంక్రాంతి కానుకగా ఈ రోజు తన కొత్త మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. వెంకటేష్ తోనే ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్లీ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడంతో వెంకటేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీ పట్ల ఆసక్తి నెలకొంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ లో యాదగిరి దామోదర రాజు (వెంకటేష్) తన భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేష్) తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటాడు. రాజుకి భాగ్యం, భాగ్యంకి రాజు అంటే ప్రాణం కంటే ఎక్కువ. అంత అన్యోన్య దాంపత్యంతో ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రపంచ ఐటి దిగ్గజం సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్)ని కొంత మంది రౌడీలు కిడ్నాప్ చేసి ఒక కండిషన్ పెడతారు. దీనితో తెలంగాణ ముఖ్యమంత్రి కేశవ(నరేష్), రాజుని సంప్రదిస్తాడు. ఇంకో పక్క రాజు మాజీ ప్రేయసి మీనాక్షి(మీనాక్షి చౌదరి), రాజు దగ్గరకి చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. చాలా ఏళ్ళకి రాజు దగ్గరకి మీనాక్షి ఎందుకు వచ్చింది? సత్య ఆకెళ్ళని ఎవరు కిడ్నాప్ చేసారు? వాళ్ళు పెట్టిన కండిషన్ కి రాజుకి సంబంధం ఏంటి? అసలు ముఖ్యమంత్రి రాజు నే ఎందుకు ఎంచుకోవాలి? అసలు రాజు ఎవరు? అతను ఏం చేసాడు? పూర్తి పేరు యాదగిరి దామోదర రాజు వెనుక ఏమైనా కథ ఉందా? అనేదే ఈ చిత్ర కథ.
ఎనాలసిస్:
‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి కథతో కూడిన సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లే తో, కామెడీ పంచులతో సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సాగింది. ఎందుకంటే దర్శకుడు సినిమా స్టార్టింగ్ లోనే నా సినిమా కథ ఇది అని చెప్పేస్తాడు. కాబట్టి కథనం ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సాగాలి. ఈ మూవీలో అదే జరిగింది. ఫస్ట్ హాఫ్ లో వెంకీ, ఐశ్వర్య ల మధ్య సీన్స్, వెంకీ కి అతని కొడుకు, మామకి మధ్య వచ్చే సీన్స్ గాని థియేటర్ లో నవ్వులు పూయించాయి. కాకపోతే పిల్లాడి చేత అలా బూతులు చెప్పడం ఏంటనే అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ సీక్వెన్స్ జంధ్యాల సినిమా నుంచి తీసుకున్నదే. ఇక చాలా సినిమాల్లో వచ్చిన సీన్స్ అయినా కూడా డైలాగులు, పాత్రల చిత్రీకరణ వల్ల ఫ్రెష్ గా అనిపించాయి. సినిమా చూస్తే ప్రేక్షకుడు బోర్ కొట్టకుండా ఉండటానికి మీనాక్షిని ఎంట్రీ చేసిన ప్లేస్ మెంట్ బాగుంది. అలాగే ఐశ్వర్య, మీనాక్షి ల క్యారెక్టర్ ల డిజైన్ సగటు ఆడవాళ్ళ లాగే ఉంది. ఎక్కడా కూడా సినిమాటిక్ ని ఫాలో అవ్వలేదు. ఇక సెకండ్ హాఫ్ లో కిడ్నాపర్ల కోసం వెంకటేష్, భాగ్యం, మీనాక్షి లతో పాటు మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడం కొత్తగా ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్ లో వచ్చే సీన్స్ అన్ని రొటీన్ తరహాలోనే సాగాయి. అయితే డైలాగుల వల్ల ఆ లోటు కనిపించదు. పోలీస్ ఆఫీసర్ ఆంథోనీ క్యారక్టర్ చేసిన కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక చివర్లో వెంకటేష్ లక్ష్యం సినిమాకి నిండుతనాన్ని తెచ్చింది. చాలా మందిని ఆ పాయింట్ ఆలోచింపజేస్తుంది కూడా.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు:
వెంకటేష్ నటన గురించి, ఆయన కామెడీ టైమింగ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఎన్నో సినిమాలని తన వన్ మాన్ షో తో నడిపించినట్టే, ఈ ‘సంక్రాంతికి వస్తున్నాం’ని కూడా తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించాడు. యాదగిరి దామోదర రాజుగారి భార్య అంటే ఎంత ప్రేమో, అదే సమయంలో మాజీ ప్రేయసితో, భార్య ముందు ఇబ్బంది పడుతూ ట్రావెల్ చేసే భర్తగా, ఆ పోరు పడలేక ఆవేశాన్ని దిగమింగుకుంటూ రౌడీలతో ఫైట్ చేసి క్యారెక్టర్ లో వెంకీ సూపర్ గా చేసాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పోలీస్ ఆఫీసర్ గా కూడా వెంకీ ని చూస్తే ఆయన గత చిత్రం ఘర్షణ గుర్తుకొచ్చింది. ఇక భాగ్యం క్యారెక్టర్ లో ఐశ్వర్య ఒదిగిపోయిందని చెప్పవచ్చు. విలేజ్ లో ఉండే ఆడవాళ్లు భర్త అంటే ఎంత ప్రేమని చూపిస్తారో తన క్యారక్టర్ ద్వారా తెలియచేసింది. భాగ్యం క్యారెక్టర్ ఆమె కెరిరీలో వన్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఇక మీనాక్షి చౌదరి కి కూడా ఇదే వర్తిస్తుంది. ఐపీఎస్ మీనాక్షి గా అద్భుతంగా నటించి తనలో ఎంత మంచి నటి ఉందో నిరూపించింది. ఇక మిగిలిన పాత్రల్లో చేసిన నరేష్, మురళి గౌడ్, శ్రీనివాస రెడ్డి, వీటీ గణేష్, పమ్మి సాయి, సర్వదమన్ బెనర్జీ లు తమ పాత్ర పరిధి వరకు చక్కగా నటించారు. ముఖ్యంగా వెంకటేష్ క్యారెక్టర్ లో చేసిన బాబు ఐతే తన పర్ఫామెన్స్ ద్వారా థియేటర్స్ లో నవ్వులు పూయించాడు.
ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే రచయితగా,దర్శకుడుగా కామెడీ అందించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. భీమ్స్ సిసిరిలియో సంగీతంలోని పాటలు బాగా ఉన్నాయి. కాకపోతే ఆర్ ఆర్ విషయంలో ఇంకొంచం బాగుండాలని అనిపించింది. ఇక ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సినిమా తగట్టుగా లేవని అనిపిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే..
లాజిక్ లేకుండా కామెడీని ఎంజాయ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి మూవీ నచ్చవచ్చు. కాకపోతే లాజిక్ లు వెతికే వాళ్లకి నచ్చకపోవచ్చు. సంక్రాంతి ని దృష్టిలో పెట్టుకొనే తెరకెక్కించిన ఈ మూవీని టైం పాస్ కోసమైతే చూసేయచ్చు.
రేటింగ్: 2.75/5
– అరుణాచలం