సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రయాణం.. ఒక హిట్, రెండు ఫ్లాప్ లు అన్నట్టుగా సాగుతుంది. కానీ నందమూరి హీరోలు బాలకృష్ణ (నందమూరి బాలకృష్ణ), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలకృష్ణ వరుసగా నాలుగు విజయాలను ఖాతాలో వేసుకోగా, ఎన్టీఆర్ ఏకంగా ఏడు వరుస విజయాలను అందుకున్నాడు.
2021లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో బాలయ్య విజయపరంపర మొదలైంది. ఆ తర్వాత ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకొని.. హ్యాట్రిక్ సాధించాడు. హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణ, ఇటీవల ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే రూ.105 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బాలయ్య ఖాతాలో మరో విజయాన్ని ఖరారు చేసింది. వరుసగా నాలుగు విజయాలను ఖాతాలో వేసుకున్నట్లు అయింది. (డాకు మహారాజ్)
ఇక బాబాయ్ బాలకృష్ణ జోరు అలా ఉంటే, అబ్బాయ్ ఎన్టీఆర్ జోరు అంతకుమించి అనేలా ఉంది. 2015లో వచ్చిన ‘టెంపర్’ నుంచి అపజయమెరుగకుండా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ‘టెంపర్’ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ సినిమాలతో విజయాలను అందుకొని మొదటి హ్యాట్రిక్ సాధించాడు. అదే జోష్ లో ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో హిట్స్ కొట్టి రెండో హ్యాట్రిక్ సాధించాడు. డబుల్ హ్యాట్రిక్స్ తర్వాత ‘అడుగుదేవర’తో థియేటర్లలో అడుగుపెట్టి, సంచలన వసూళ్లతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ‘టెంపర్’ నుంచి ‘దేవర’ వరకు వరుసగా ఏడు విజయాలను ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్స్ లేరనే చెప్పాలి. ఈ నందమూరి హీరోల జోరు చూస్తుంటే.. బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్, ఎన్టీఆర్ ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించినా ఆశ్చర్యం లేదు అనిపిస్తోంది.