ప్రస్తుతం మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు, మంచు మనోజ్ మరో వైపు అన్నట్టుగా వివాదం నడుస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఆస్తి పంపకాలు అని మొదట ప్రచారం జరిగింది. కానీ మనోజ్ మాత్రం, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న సమస్యల గురించి విద్యార్థుల తరపున తాను గళం వినిపిస్తున్నందుకే.. తనని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. మొదట ఈ గొడవ హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద జరిగింది ఆ తర్వాత సద్దుమణిగింది. మళ్ళీ ఇటీవల తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద వివాదం జరిగింది. ఈ తాజా మనోజ్ కి ఊహించని షాక్ తగిలింది. యూనివర్సిటీ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మనోజ్ తీరుని తప్పుబడుతున్నారు. తమ కడుపులు కొట్టొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోలు, లెటర్లు విడుదల చేస్తున్నారు. (మంచు మనోజ్)
మనోజ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ తాజాగా రంగంపేట సర్పంచ్ ఎర్రయ్య ఒక వీడియో విడుదల చేశాడు. “ఈ ప్రాంతంలో మా భూముల ధరలు పెరగడానికి కారణం మోహన్ బాబు గారు. ఆయన వల్ల ఎందరో ఉపాధి పొందుతున్నారు. హాస్టల్స్ నడుపుతున్నారు. ఈ చుట్టు పక్కల ఎవరికి ఏ సమస్య వచ్చినా మోహన్ బాబు గారి దగ్గరకే వెళ్తారు. మనోజ్ గారు మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేసి, మా కడుపులు కొట్టొద్దు.” అని వీడియోలో చెప్పుకొచ్చాడు.
ఇక యూనివర్సిటీలోని హాస్టల్స్ ఓస్ అసోసియేషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లేఖను విడుదల చేసింది. “మోహన్ బాబు విద్యాలయాల వల్ల మేము ఇక్కడ హాస్టల్స్ కట్టుకొని కుటుంబాలను పోషించుకుంటూ బ్రతుకుతున్నాము. స్టూడెంట్స్ కి హాస్టల్ యాజమాన్యంతో కానీ, యూనివర్సిటీ యాజమాన్యంతో కానీ ఎటువంటి సమస్యలు లేవు. ఏమైనా చిన్నా చితక సమస్యలు వచ్చినా మోహన్ బాబు గారికి లేదా విష్ణు గారికి చెప్పుకుంటాము.. వారు సామరస్యంగా పరిష్కరిస్తారు. మనోజ్ గారు.. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే మీరూ పరిష్కరించుకోండి మా బతుకులతో ఆడుకోకండి, మమ్మల్ని రోడ్డు మీదకు లాగకండి.” అని లేఖలో సూచించింది.
మరి ఈ వీడియో మరియు లెటర్ పై మనోజ్ ఎలా కనిపిస్తాడో చూడాలి.