చిత్ర పరిశ్రమలో కొందరు నటీనటులు ఎప్పుడూ వివాదాలు సృష్టిస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఏదో ఒక అంశం మీద కామెంట్ చేయడం, దాన్ని వివాదం చేయడం వారికి ఎంతో సహజమైన విషయం. అలాంటి వివాదస్పదుడిగా పేరు తెచ్చుకున్న నటుడు రాధారవి. తమిళ్‌లో ఎన్నో సినిమాలు చేసి నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన పాతతరం హీరో అయిన ఎం.ఆర్.రాధ కుమారుడు. నటి రాధిక కూడా ఆయన కుమార్తే. కానీ, ఇద్దరి తల్లులు వేరు. అలా వాళ్లిద్దరూ అన్నా చెల్లెళ్లు.
వివాదస్పదుడిగా పేరు తెచ్చుకున్న రాధారవికి రాధికతో కూడా కొన్నాళ్లు వివాదం నడిచింది. దేశంలో జరిగిన ఎన్నో సంఘటనలపై స్పందించి అందరి విమర్శలను ఎదుర్కొన్నారు రాధారవి. తాజాగా ఓ కొత్త తెరపైకి తీసుకొచ్చి మరో వివాదాన్ని సృష్టించారు. అది వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్‌పై ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీదత్ తనను ఏ విధంగా అవమానించారు.
‘నాకు తెలుగులో రాఘవేంద్రరావుగారు గాడ్ ఫాదర్ లాంటి వారు. సినిమాల్లో నా ఎదుగుదలకు ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. వెంకటేష్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ రాఘవేంద్రరావుగారు డైరెక్ట్ చేసిన ‘కలియుగ పాండవులు’ సినిమాలో నేను నటించాను. ఆ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతున్నప్పుడు అశ్వినీదత్‌గారు నిర్మించే మూడు సినిమాల్లో నన్ను బుక్‌కి వచ్చారు. నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను. ఏదైనా రాఘవేంద్రరావుగారికి చెప్పండి. ఆయన ఓకే అంటే నేను ఓకే అన్నాను. అశ్వినీదత్‌గారు నన్ను ఓ మాట అడిగారు ‘మీరు ఏరియాకు చెందినవారు’ అని. అంటే దాని అర్థం ఏ క్యాస్ట్ అని. నేను బలిజ నాయుడు అని చెప్పాను. ఆ మాట విని సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత నాకు తెలిసినమిటంటే ఆ మూడు సినిమాల నుంచి నన్ను తొలగించారు. తెలుగు ఇండస్ట్రీ క్యాస్ట్‌మీద నడుస్తోందా అని అప్పుడు అనుకున్నాను. ఇది తెలుసుకొని రాఘవేంద్రరావుగారు ‘ఆ సినిమాల నుంచి మిమ్మల్ని ఎందుకు తీసేశారు’ అని అడిగారు. నాకు తెలీదు అని చెప్పాను. ‘మీరేం బాధపడకండి. వైజయంతి మూవీస్‌లోనే మీరు ఓ సినిమా చేస్తున్నారు. అంతే. ఆయన చెప్పినట్టుగానే ఓ సినిమా చేశాను’ అని రాధారవి వివరించారు.