సినిమా పేరు: బఘీర
నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, రామచంద్ర రాజు, ప్రకాష్ రాజ్, రంగాయన రాజు, అచ్యుత్ కుమార్
కథ: ప్రశాంత్ నీల్
ఫొటోగ్రఫీ: ఏజే శెట్టి
ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
బ్యానర్:హోంబులే ఫిలిమ్స్
నిర్మాత: విజయ్ కిరగందూర్
రచన, దర్శకత్వం: సూరి
విడుదల తేదీ: అక్టోబర్ 31, 2024
కన్నడ హీరో శ్రీ మురళి నటించిన బఘీర మూవీ దివాళి కానుకగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కేజీఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 ,సలార్ వంటి ప్రముఖ హిట్ చిత్రాలకు దర్శకుడుగా వ్యవహరించిన ప్రశాంత్ నీల్(ప్రశాంత్ నీల్)కథని అందించాడు.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
వేదాంత్( శ్రీ మురళి) చిన్నప్పటి నుంచే సూపర్ హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. సమాజానికి మంచి చేసే పోలీస్ కూడా ఒక సూపర్ హీరోనే అని తన తల్లి చెప్పడంతో పెద్దయ్యాక పోలీస్ అవుతాడు.ప్రజలకి అన్యాయం చేస్తే కొంత మంది కరుడు గట్టిన నేరస్తుల్ని అరెస్ట్ చేస్తాడు.కానీ రాజకీయంగా పలుకుబడి కారణంగా వాళ్ళని వదిలేయవలసి వస్తుంది. పైగా అప్పట్నుంచి తను కూడా లంచాలు తీసుకుంటూ నేరస్థులకు అండగా ఉంటాడు. కొన్ని వందల మందిని చంపిన నరరూప రాక్షసుడు రానా (గరుడ రామ్) మనుషుల శరీరానికి సంబంధించిన అవయవాలతో వ్యాపారం చేస్తూ శ్రీలంకకి చెందిన కొంత మందితో ఒక భారీ డీల్ సెట్ చేసుకుంటాడు.మరో పక్క బఘిర అనే ఒక వ్యక్తి ప్రజలకి అన్యాయం చేసే రౌడీలని చంపుతున్నాడు.బఘీర కోసం సీబీఐ రంగంలోకి దిగి ఒక స్పెషల్ ఆఫీసర్ (ప్రకాష్) రాజ్) ని నియమిస్తుంది. మరో వైపు వేదాంత్ కి స్నేహ(రుక్మిణి వసంత్) అనే డాక్టర్ తో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కూడా. కానీ ఆ తర్వాత స్నేహ ని పెళ్లి చేసుకోనని వేదాంతం చెప్తాడు.వేదాంతం అలా సడెన్ గా మారడానికి కారణం ఏంటి? అసలు బఘీర ఎవరు? ఎందుకు రౌడీలని చంపుతున్నాడు? వేదాంతం ఎందుకు అవినీతి పరుడుగా మారాడు? రానా డీల్ నెరవేరిందా? స్నేహ, వేదాంత్ ల పెళ్లి ఏమైంది? సీబీఐ బఘీర విషయంలో చివరకి ఏం చేసింది? అనేదే ఈ కథ
ఎనాలసిస్
ఇలాంటి కథలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద గతంలో చాలా వచ్చాయి. పైగా మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందో, లాస్ట్ కి ఏం జరుగుతుందో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ప్రారంభ సన్నివేశం నుంచి ఒక పది నిముషాలు సేపు కొత్త కథ ఏమైనా చూస్తామనే ఆశ ప్రేక్షకుడిలో మొదలవుతుంది.కానీ ఆ తర్వాత సాధారణ సినిమాల కోవలోకి వెళ్ళింది. ఒక్కో సీన్ వస్తుంటే చాలా సినిమాలో చూసిన సీన్స్ అని అనిపిస్తుంది.ఇక హీరోయిన్ గా చేసిన రుక్మిణి వసంత్ ని కూడా సరిగా వాడుకోలేదు. శ్రీ మురళి, రుక్మిణి మధ్య కథ నడిపే అవకాశమున్నా కూడా ఆ దిశగా మేకర్స్ ఆలోచించలేదు.ఇక సెకండ్ ఆఫ్ అయినా కొత్తగా ఉంటుందేమో అనుకుంటే ఎంత సేపు ఆపదలో ఉన్న వాళ్లని కాపాడటమే సరిపోయింది. విలన్ క్యారక్టర్ ని ఎక్కువగా వాడుకోలేదు. కేవలం రెండు డైలాగులు, క్లైమాక్స్ ఫైట్ తోనే సరిపెట్టారు. క్యారక్టర్ ల మధ్య నడిచే నాటకీయత అనేది ఈ సినిమాలో లోపించింది. ప్రకాష్ రాజ్ చేసిన క్యారక్టర్ లో కూడా డైలాగులు తప్ప ఆయన పెద్దగా ఇన్విస్టిగేషన్ చేసింది ఏం లేదు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
హీరో శ్రీ మురళి(sri murali)తన క్యారక్టర్ కోసం పడ్డ కష్టం మొత్తం ఈ సినిమాలో కనపడుతుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడు.కాకపోతే సీన్స్ లో కొత్తదనం లేకపోవడం వల్ల తను ఎంత చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రుక్మిణి(rukmini vasanth)కి పెద్దగా ఏమి లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది. ఇక విలన్ గా చేసిన రామచంద్ర రాజు దగ్గరనుంచి ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్ వరకు ఎవరి నటనలో ప్రత్యేకంగా మెరుపులు లేవు. దర్శకుడు విషయానికి వస్తే ప్రతి సీన్ కూడా చాలా చక్కగా ఎలివేట్ చేసాడు. కానీ సీన్స్‌లో బలం లేదు.ఇక ఫొటోగ్రఫీ, నిర్మాణ విలువలు పర్లేదనే స్థాయిలో ఉన్నాయి.అజనీష్ లోక్‌నాథ్ ఆర్ ఆర్ ఒక రేంజ్లో ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే రొటీన్ కథ, కథనాలతో సాగిన బఘీర(bagheera)ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ అని చెప్పవచ్చు
రేటింగ్ 2 .5 / 5 అరుణాచలం