- డ్రగ్స్, అక్రమ మద్యం సరఫరాదారులపై డేగ కన్ను
ముద్ర, తెలంగాణ బ్యూరో : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రతిసారి హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ నేపథ్యంలో నగరానికి గోవా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల నుంచి అక్రమంగా డ్రగ్స్ మాఫియా డ్రగ్స్, మద్యం సరఫరా చేయవచ్చనే కోణంలో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీన్యాబ్) అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ (ట్రై) కమిషనరేట్ల పరిధిలో పూర్తి స్థాయిలో కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధిలో ప్రతి బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్ లు , ఫాంహౌస్ లు , రిసార్టులతో పాటుగా ప్రైవేట్ హోటల్స్ రూమ్స్ పై సోదాలను నిర్వహిస్తారు.
డ్రగ్స్ హాట్ స్పాట్‌లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు ముగిసేంతవరకు నిరంతర తనిఖీలు చేయనున్నారు. మరోపక్క డార్క్ వెబ్ సైట్లపై పోలీసులు నిఘా పెట్టారు. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఎవరైనా డ్రగ్స్ తీసుకుని వారిని అక్కడికక్కడే అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం 800 డ్రగ్స్ టెస్ట్ కిట్లు, 20 డాగ్స్ స్వ్కాడ్ బృందాలు సిద్దంగా ఉన్నాయి. ఇదిలావుండగా, ఇతర ప్రాంతాలకు చెందిన నాన్ డ్యూటీడ్ పెయిడ్ లిక్కర్ తెలంగాణలో కాకుండా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా రైళ్ళు, ట్రావెల్స్ బస్సుల్లోనూ తనిఖీలను చేపడుతున్నారు. ప్రధానంగా నాన్ పెయిడ్ లిక్కర్ ను దిగుమతి చేసే ముఠాలపై నిఘా పెట్టారు. ఎస్ టీఎఫ్, డీటీఎఫ్, ఇతర ఎక్సైజ్ శాఖ బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయి. నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్ మేనేజర్ల కదలికలు, కమర్షియల్, ఫంక్షన్ హాళ్ళు, కన్వెన్షన్ సెంటర్లపై డేగ కన్ను పెట్టారు.