ముద్ర.వీపనగండ్ల :- పాము కాటుకు గురై వారం వ్యవధిలో అత్తా కోడలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వల్లభాపురంలో జరిగింది. గ్రామస్తులు కుటుంబీకుల కథన ప్రకారం గ్రామానికి చెందిన సగనమోని కిష్టమ్మ(75) అనే మహిళ ఇంటి వద్ద ఉండగా నాగుపాము కాటు వేసినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం వీపనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో అదే గ్రామానికి చెందిన సగనమోని ఎల్లమ్మ అనే మహిళ (55) (మరణించిన కిష్టమ్మ కోడలు) ఇంటి వద్ద పాము కాటు కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించిన ఫలితం లేకపోవడంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.ఒక వారం వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన అత్తా, కోడలు పాము కాటు గురై మృతి చెందారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మహిళలను కాటు వేసిన పామును గ్రామస్తులు చంపివేశారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన జూపల్లి అరుణ్
పాము కాటుకు గురై మృతి చెందిన మహిళల కుటుంబాలను మంత్రి జూపల్లి తనయుడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జూపల్లి అరుణ్ పరామర్శించి, ఆర్థిక సహాయం అందించి మనోధైర్యం కల్పించారు. వారం వ్యవధిలో ఒకే కుటుంబంలో అత్తా, కోడలు మృతి చెందడం బాధాకరమని, కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, నాయకులు ప్రతాపరెడ్డి, రవి, ప్రతాప్ రెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.
The post వారం వ్యవధిలో పాము కాటుకు అత్తా, కోడలు మృతి appeared first on Mudra News.