మూవీ : పని
నటీనటులు: జోజు జార్జ్, అభినయ, సాగర్ సూర్య , జునైద్ జరిగింది
ఎడిటింగ్: మను ఆంటోనీ
మ్యూజిక్: సామ్ ఎస్.ఎస్
సినిమాటోగ్రఫీ: వేణు-జింటో జార్జ్
నిర్మాతలు: ఎమ్.రియాజ్ ఆడమ్, సిజూ వడక్కన్
కథ, దర్శకత్వం: జోజు జార్జ్
ఓటీటీ: సోనిలివ్
కథ:
కేరళలోని ఓ ప్రాంతంలో గిరి (జోజు జార్జ్) అతని భార్య గౌరీ (అభినయ) ఉంటారు. వాళ్ళ ఏరియాలో గిరి పెద్ద గ్యాంగ్ స్టర్. అతనికి సపోర్టుగా డేవిడ్, కురువిల్లా, సాజీ ఉంటారు. అలా వాళ్లను టచ్ చేయడానికి ఆ ప్రాంతంలో అందరూ భయపడుతుంటారు. కొత్తగా వచ్చిన కమిషనర్ రంజిత్ వేలాయుధన్ వాళ్ల గురించి ఆరాతీస్తుంటాడు. సెబాస్టియన్ (సాగర్ సూర్య), సిజూ (జునైద్) ఇద్దరు ఒక మెకానిక్ షెడ్లో ఉంటారు. ఇద్దరూ కూడా డబ్బుల కోసం ఏం చేయడానికైనా సిద్ద పడతారు. అందుకే డబ్బు కోసం సురేశ్ అనే వ్యక్తిని మర్డర్ చేసి తప్పించుకుని తిరుగుతుంటారు. గిరి గురించి అతని బ్యాక్ గ్రౌండ్ గురించి సెబాస్టియన్, సిజూలకి తెలియదు. అలా ఒక సూపర్ మార్కెట్ లో గిరి భార్య గౌరి పట్ల అసభ్యంగా ప్రవర్తించి గిరి చేతిలో తన్నులు తింటారు. వాళ్లిద్దరూ ఆకతాయిలు కావడంతో వారిని గిరి వదిలేస్తాడు. కానీ వాళ్ళు ఆ తర్వాత చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమని అవమానపరిచిన గిరిని భయంతో పరుగులు పెట్టాలని సెబాస్టియన్ – సిజూ నిర్ణయించుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్లేం చేశారు? గిరి వారిని ఎలా ఎదుర్కున్నాడనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ కథ ఓ గ్యాంగ్ స్టర్ చుట్టూ ఇద్దరు ఆకతాయిల చుట్టూ తిరుగుతుంది. ఇది చూసాక కామన్ ఆడియన్ కి కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. చియాన్ విక్రమ్ నటించిన ‘స్కెచ్’ మూవీని చూసినట్లుగా ఈ సినిమా అనిపిస్తుంది.
కాసేపు ఏ పని పెట్టుకోకుండా ఈ పనిని చూస్తే నీకెందుకురా ఈ పని అనేలా నా పని అయిపోయింది. రొటీన్ డ్రామా విత్ వీక్ స్టోరీ టెల్లింగ్. నెక్స్ట్ సీన్ ఊహించే విధంగా కథ సాగుతుంది. హీరోయిన్ కి జరిగిన దాన్ని మర్చిపోమ్మా అన్నట్టుగా చూపించడం.. అంత పెద్ద డాన్ అయినటువంటి హీరో ఇంట్లోకి ఇద్దరు ఆకతాయి(బచ్చా)లు రావడం కాస్త లాజిక్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ లో కూడా చాలా వరకు సాగదీసారు.
హీరోకి నాలుగు వందలమంది సైన్యం ఉండి ఇద్దరు ఆకతాయిలని పట్టుకోలేకపోవడం కామెడీగా అనిపిస్తుంది. సరిగ్గా చూస్తే మూడంటే మూడు సీన్లు ది బెస్ట్ అనిపించేలా ఉన్నాయి. కథ రొటీన్.. స్క్రీన్ ప్లే కాస్త బాగున్నప్పటికి పెద్దగా మ్యాటర్ లేదు. రెండు, మూడు చోట్ల అశ్లీల దృశ్యాలు ఉన్నాయి. ఇక రక్తపాతం అయితే విచ్చలవిడిగా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. పనేమీ లేకుండా సినిమాలు చూడటమే పనిగా పెట్టుకునే వారికి ఈ పని చూస్తే కాలమే అవుతుందే తప్ప పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
గిరి పాత్రలో జోజు జార్జ్ ఆకట్టుకున్నాడు. గౌరీగా అభినయ ఆకట్టుకుంది. సెబాస్టియన్ గా సాగర్ సూర్య, సిజూగా జునైద్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగిలినవారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: జస్ట్ వాచెబుల్.
రేటింగ్: 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్