కాకినాడ, ఫిబ్రవరి 8: తల్లి పాల దానం చేయవచ్చు. తల్లి పాలు దానం చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారా! ఔను.. తల్లి పాలను సైతం ఇకనుంచి దానం చేయొచ్చు. తల్లి పాలకు దూరమైన బిడ్డలకు ప్రాణ భిక్ష, ఆరోగ్య భిక్ష కల్పించవచ్చు. రక్తదానం మాదిరిగా అమ్మను దానంగా స్వీకరించి నిల్వ చేయడానికి రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో ‘మదర్ మిల్క్ బ్యాంక్’ సిద్ధమవుతోంది. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) పీడియాట్రిక్ విభాగం పైఅంతస్తులో 8 గదులతో ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ‘సుషేణ హెల్త్ ఫౌండేషన్’ మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్‌కుమార్ దేశంలోనే 8వ మదర్ మిల్క్ బ్యాంక్‌ను ఈ నెల 13న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫౌండేషన్ రూ.కోటితో మూడు విడతల్లో దీని నిర్మాణం చేపడుతోంది.తల్లి పాలు బిడ్డ ఎదుగుదల, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో కీలకం. వీటి ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల కొందరు.. శరీరాకృతి మారిపోతుందనే అపోహతో మరికొందరు.. తల్లి పాలు రాక ఇంకొందరు పిల్లలు చనుబాలకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా పోత పాలతో బిడ్డ ఆకలి తీరుస్తుండటం వల్ల బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆరోగ్యాన్ని పరోక్షంగా దెబ్బ తీస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా ప్రసవాలు జరిగే టాప్–5లో ఉన్న కాకినాడ జీజీహెచ్‌ను ‘సుషేణ’ హెల్త్ ఫౌండేషన్ ఎంపిక చేసుకుంది. నవజాత శిశువు నుంచి రెండేళ్ల బిడ్డ వరకు ఈ బ్యాంక్‌లో పాలు ఇస్తారు. తల్లి బిడ్డకు మిగులు పాలను సేకరించి అవసరమైన పిల్లలకు అందిస్తారు. ఐవీ, వీడీఆర్ఎల్ (వెనెరియల్ డిసీజ్ రీసెర్చ్ లేబొరేటరీ టెస్ట్), హెపటైటిస్ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే తల్లి పాలు తీసుకుంటారు. కాగా, ఇక్కడ తల్లుల చనుబాల పరిమాణం పెంచేందుకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు.మసాజ్ థెరఫీ, న్యూట్రిషనల్ ట్రీట్మెంట్ (పోషకాలతో కూడిన వైద్యం), మదర్‌కేర్ (బిడ్డను హత్తుకుని పాలిచ్చే) తరహాలో తల్లులకు బిడ్డలను కనీసం గంటపాటు హత్తుకుని ఉండేటట్టు ఈ బ్యాంక్‌లోని ప్రత్యేక విభాగంలో నిపుణుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఇలా ఈ బ్యాంక్‌లో రెండు, మూడు రోజులు ఉంచి తల్లులకు అవగాహన వచ్చాక ఇంటి వద్ద ఇదే విధానాన్ని అనుసరించాలని సూచించి పంపుతారు. స్వచ్ఛంద దాతలు జీజీహెచ్ మిల్క్ బ్యాంక్‌కు వచ్చి పాలు దానం చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. తొలి దశలో సేకరించిన పాలను నిల్వ చేయకుండా వెంటనే అవసరమైన శిశువులకు పట్టిస్తారు. రెండో దశలో పాలను నిల్వ చేస్తారు. కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు వాటిని పాడవకుండా భద్రపరుస్తారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాలు జీజీహెచ్‌లో సిద్ధమయ్యాయి. తొలి దశ ప్రారంభమైన నెల రోజుల వ్యవధిలో మిల్క్ పాశ్చరైజేషన్ జరిగేలా ప్రణాళిక రూపొందించారు.