తారాగణం: విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గోపరాజు రమణ, సాయి కుమార్, హైపర్ ఆది, పమ్మి సాయి, ప్రవీణ్ నిర్వహించారు.
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
ఎడిటర్: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: కృష్ణ చైతన్య
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాలు
విడుదల తేదీ: మే 31, 2024
కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాని రూపొందించాడు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ చిత్రం మంచి అంచనాలతో నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
లంకలకు చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. ఒక సాధారణ యువకుడు. కానీ అతని ఆలోచనలు అసాధారణంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, పదిమందిని శాసించే స్థాయికి ఎదగాలి అనుకుంటాడు. దాని కోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు. తన ఎదుగుదల కోసం కాలర్ పట్టుకోవడానికైనా, కాళ్ళు పట్టుకోవడానికైనా సిద్ధపడే రకం. అలాంటి రత్న.. ఆ ప్రాంత ఎమ్మెల్యే దొరస్వామిరాజు(గోపరాజు రమణ) పంచన చేరి, అతనికి నమ్మిన బంటుల పేరు తెచ్చుకుంటాడు. తెరవెనుక మాత్రం, ప్రత్యర్థి పార్టీ నాయకుడు నానాజీ(నాజర్)తో చేతులు కలిపి.. దొరస్వామిరాజుకి వెన్నుపోటు పొడిచి తానే ఎమ్మెల్యేగా ఎదుగుతాడు. ఆ తరువాత రత్న జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. అసలు రత్న గతం ఏంటి? అతను ఎందుకు ఇలా తయారయ్యాడు? అతని జీవితంలో బుజ్జి(నేహా శెట్టి), రత్నమాల(అంజలి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? తన ఎదుగుదలకు కారణమైన వారే, తనని అసహ్యించుకునేలా రత్న ఏం చేశాడు? అసలు అతను ఏం సాధించాడు?, ఏం పోగుట్టుకున్నాడు?, చివరికి ఏం తెలుసుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ని ఒక ఇంటెన్స్ ఫిల్మ్ గా ముందు నుంచి ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు కూడా ప్రచార చిత్రాలు చూసి.. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయని భావించారు. చిత్రం బృందం కూడా ఇందులోని భావోద్వేగాలు కట్టిపడేస్తుందని చెప్పుకొచ్చింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఆ భావన కలగదు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. డ్రామా తేలిపోయింది.
మనకి గోదావరి అనగానే కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వెటకారాలు, మమకారాలు ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. మెజారిటీ సినిమాల్లో ఇవే చూపిస్తారు. అలాంటి గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి కథాంశంతో సినిమా చేయడం, హీరోని నెగటివ్స్ లో చూపించాలంటే దర్శకుడి ఆలోచన కాస్త కొత్తగా ఉంది. అయితే ఆ సెటప్ కి తగ్గ కథాకథనాలు తోడు కాలేదు. అలాగే, ఎప్పుడైనా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయాలి. అప్పుడే ప్రేక్షకులు ఆ పాత్రతో ట్రావెల్ అవుతూ.. సినిమాలో లీనమవుతారు. అలా హీరో పాత్రని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.
తన కోసం, తాను ఎదగడం కోసం ఏదైనా చేసే మొండివాడిగా రత్న పాత్రని పరిచయం చేస్తూ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ రత్న ప్రయాణం మాత్రం అంత ఆసక్తికరంగా సాగలేదు. అతను ఎమ్మెల్యే దగ్గర పనిలో చేరి, ఆ తర్వాత తానే ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రయాణం సినిమాటిక్ గా అనిపించింది. పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఫస్టాఫ్ పరవాలేదు అనేలా నడిచింది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంది. ఇటువంటి కథల్లో విలన్ పాత్ర బలంగా ఉండాలి. అతని నుంచి బయటపడలేనంత ఇబ్బందికర పరిస్థితులు హీరోకి ఎదురు కావాలి. అప్పుడే హీరో పాత్ర ఎక్కువ ఎలివేట్ అవుతుంది. కానీ ఇందులో అవి లోపించడంతో.. సెకండాఫ్ తేలిపోయింది. ఊహించని మలుపులు, కట్టిపడేస్తే భావోద్వేగాలు లేకపోవడంతో.. దాదాపు సినిమా అంతా ఫ్లాట్‌గానే నడిచింది. చివరి 20 నిమిషాల్లో మాత్రం కొంత ఎమోషన్ పండింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక ఈ సినిమా, ఇందులోని హీరో పాత్రని చూస్తే.. మనకి ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘రణరంగం’ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అసలు ఆ రెండు సినిమాలను కలిపి.. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథను రాసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ‘నేనే రాజు నేనే మంత్రి’ కథలోకి ‘రణరంగం’ హీరో వచ్చినట్టుగా ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే.. ‘రణరంగం’ కూడా సితార బ్యానర్ లోనే రూపొందించబడింది.
సాంకేతికంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ బాగానే ఉంది. అనిత్ మదాడి కెమెరా పనితనం ఆకట్టుకుంది. సినిమా మూడ్ కి తగ్గట్టుగా ఫ్రేమ్స్, లైటింగ్ ఉన్నాయి. యువన్ శంకర్ రాజా స్వరపరిచిన పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే. కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
లంకల రత్న పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషన్ సీన్స్ లోనూ మెప్పించాడు. అంజలి చేసిందనే తప్ప రత్నమాల పాత్రకు అంత ప్రత్యేకత లేదు. కానీ తనదైన నటనతో ఆ పాత్రను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇక బుజ్జిగా నేహా శెట్టికి మంచి పాత్రే దక్కింది. నిజానికి రత్న, బుజ్జి పాత్రల మధ్య బలమైన సంఘర్షణను చూపించడానికి ఎంతో ఆస్కారముంది. కానీ దానికి బలమైన సన్నివేశాలు పడుతున్నాయి.. బుజ్జి పాత్ర పూర్తి స్థాయిలో మెప్పించలేదు. బుజ్జి పాత్రకి భావోద్వేగాలు పండించే బరువైన సన్నివేశాలు పడుతుంటే.. నేహా శెట్టికి మంచి పేరొచ్చేది. నాజర్, గోపరాజు రమణ, సాయి, హైపర్ ఆది, పమ్మి సాయి, ప్రవీణ్ కుమార్ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఫైనల్ గా…
అంచనాలతో వెళ్తే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చూసి నిరాశ చెందుతారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘రణరంగం’ చిత్రాలను గుర్తు చేసేలా ఉన్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా లేదు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో కొత్త సెటప్, విశ్వక్ సేన్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషన్ సీన్స్ మాత్రం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
– గంగసాని