ముద్ర, ఆంధ్రప్రదేశ్: కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శనివారం పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆమె ముందుగా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి, ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిపై నామినేషన్ పత్రాలను ఆశీర్వదించారు. రాజశేఖర రెడ్డి ఘాట్ పై నామినేషన్ పత్రాలను ఉంచి తండ్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, ఆమె సోదరి డాక్టర్ సునీతా రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ, కడప ఎంపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేస్తున్నామని తెలిపారు. నాన్న చెంతన నామినేషన్ పత్రాలను పెట్టి ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు.. అన్నీ అర్థం చేసుకోగలిగిన వాళ్లు… అన్నీ అర్థమవుతున్న వాళ్లు.. మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నా… వైఎస్ రాజశేఖర రెడ్డిని, వివేకానందరెడ్డిని ఎవరూ ఇంకా మరిచిపోలేదు. నాకు సంపూర్ణ నమ్మకం వుంది. అది నిరూపించే సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. ఈ యుద్ధం యహోవాది.. భారీ మెజారిటీతో గెలుస్తానని నమ్మకం ఉందని అన్నారు.