- నెలలో 21 లక్షల మంది దర్శనం
- కోటి లడ్డూల విక్రయం
- వెల్లడించిన టీటీడీ
ముద్ర, ఏపీ : వడ్డికాసులవాడు తిరుమల వేంకటేశ్వరస్వామికి భారీగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత మార్చి నెలలో భక్తులు సమర్పించుకున్న మొక్కుల ద్వారా హుండీకి రూ.118.49 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు గుర్తించారు. సుమారు 21.10 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. కోటి లడ్డూలు విక్రయించామని, 42.85 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారని వివరించారు. 7.86 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ ప్రదర్శన. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సోమవారం సాయంత్రం 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. స్వామివారిని 62,549 మంది భక్తులు దర్శించుకోగా 26,816 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శుక్రవారం హుండీ ఆదాయం రూ. 3.33 కోట్లు వచ్చాయి.