ఐ.జే.యు. సంతాపం!
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత సి.హెచ్.రామోజీరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని , ఆయన మృతితో తెలుగు పత్రికారంగం ఒక దిక్సూచిని కోల్పోయిందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ.జే.యు.) జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ శనివారం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
డెబ్భయ్యవ దశకంలో ఈనాడు పత్రికను స్థాపించడం ద్వారా తెలుగు పత్రిక రంగంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టి ఆ రంగానికి జవసత్వాలను సమకూర్చారని, ఈనాడు నమూనా విజయవంతంగా మిగిలిన పత్రికలకు అది ఒక ప్రమాణంగా నిలిచిందని, ఆ రకంగా తెలుగు పత్రికారంగ చరిత్రను రామోజీరావు తిరగరాసారని డి.సోమసుందర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఐదు దశాబ్దాలుగా తెలుగుపత్రిక రంగంలో వృత్తి విలువలను , ప్రమాణాలను , భాషా నైపుణ్యాలను, పెంపొందించడానికి నిరంతర శిక్షణ ఇవ్వడం ద్వారా నిపుణులైన కొత్తతరం జర్నలిస్టులను ఆయన తయారు చేసారని, అక్కడ పత్రికారంగంపై తనదైన గాఢమైన ముద్రణ వేశారని సోమసుందర్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈనాడు దినపత్రికతో పాటు చతుర ,విపుల, అన్నదాత మాస పత్రికలు, ఈటీవీ, సినిమా మాధ్యమాల ద్వారా తెలుగు సమాజానికి అపురూపమైన సేవలు అందించారని, రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం ద్వారా భారతీయ చలనచిత్ర రంగానికి ఒక అద్భుతమైన కానుకను అందజేశారని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు రామోజీరావు చేసిన చిరస్మరణీయమైన దని డి. సోమసుందర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రామోజీరావు మృతితో తెలుగు పత్రికా రంగం ఒక దిక్సూచిని కోల్పోయిందని సోమసుందర్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి సోమసుందర్ సానుభూతి తెలిపారు.