ముద్ర తెలంగాణ బ్యూరో:-ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో రామోజీరావు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మీడియా రంగం విస్తరణకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. మీడియా రంగంలో నూతన ఒరవడులు సృష్టించిన రామోజీరావు అనేక భాషలకు మీడియాను విస్తరించి వేలాదిమందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు.
ఆరు దశాబ్దాలకు పైగా విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించిన రామోజీరావు తెలుగు భాష అభివృద్ధికి కూడా విశేషమైన సేవలు అందించారని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఎంతోమంది ఆదర్శవంతమైన జర్నలిస్టులను తయారుచేసిన రామోజీరావు జర్నలిస్టులకు శిక్షణ పట్ల ఎంతో ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రామోజీరావు కార్యదీక్ష, నిబద్ధత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటని.