- కరీంనగర్ కు 1000 కోట్లు తెచ్చే దమ్ముందా..?
- రాష్ట్ర ప్రభుత్వంపై రంకెలేసుడు కాదు ప్రాజెక్టులు పట్టుకురా
- రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే అంత వణుకెందుకు..?
- కేంద్ర పథకాలతో రాష్ట్రంలో ఎంత మందికి ప్రయోజనం చేకూరింది
- కేంద్ర మంత్రి బండి సంజయ్ పై వెలిచాల రాజేందర్ రావు ఫైర్
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రూ.1000 కోట్లు ఇచ్చేందుకు దమ్ము ఉందా అంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు.
ఆదివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ప్రశ్నలు సంధించారు.
కరీంనగర్ నియోజకవర్గ పై నిజంగా వెయ్యికోట్ల ప్రేమ ప్రాజెక్టు చేయాలని డిమాండ్ చేశారు. వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి పనులు చేస్తే దాన్ని అభివృద్ధి అంటూ గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రజలు చెల్లిస్తున్న 100% పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం 49 శాతం మాత్రమే రాష్ట్రానికి కేటాయిస్తున్నదని తెలిపారు.
వీటిని కూడా తమ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని జబ్బలు చర్చించుకోవడం ఏంటని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఆవాస్ యోజన, హర్గర్ జల్ యోజన, పీఎం జెన్ ఆరోగ్య యోజన, పీఎం మత్స సంపద యోజన, అటల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ యోజనతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల కింద కరీంనగర్ నియోజకవర్గంలో ఎంతమందికి ప్రయోజనం చేకూరుతుందో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. . ఎంతమంది లబ్ధి పొందారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అనేక పథకాలు అమలవుతున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారని, ఆ పథకాలను పేదలకు అందించడంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద గుండు స పెట్టిందని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తీర్మానం చేస్తే మీరెందుకు వణుకుతున్న బండి సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. పామ్ ఆయిల్ సాగులో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని విడ్డూరంగా ప్రచారం. ఈ రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టడం లేదనుకుంటున్నావా అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కుమార్ మీకు దమ్ముంటే కరీంనగర్ కు ట్రిపుల్ ఐటి, నవోదయ, కేంద్రీయ విశ్వవిద్యాలయం చేయించాలని సవాల్ విసిరారు.
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి యూజీసీ నుంచి రూ.1000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల సంక్షేమానికి మెగా టెక్స్ టైల్ క్లాస్టర్ చేయించాలని, వారికి నిరంతరం ఉపాధి కల్పించే మార్గాలు అన్వేషించాలని సూచించారు.
అదేవిధంగా నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి అదనంగా ఓ రూ.2000 కోట్లు తెప్పించాలని, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులకు అదనంగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మనోహరాబాద్ టు హైదరాబాద్, సిద్దిపేట టు సిరిసిల్ల వేములవాడ , కొత్తపల్లి రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలని వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కుమార్ కు వివరించారు.
వేములవాడ కొండగట్టు దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన రంజకమైన బడ్జెట్ రూపొందించారని, కేంద్రం వంచించినా రాష్ట్రం ఆదుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పై అవాకులు చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు అందించాలని వెలిచాల రాజేందర్ రావు బండి సంజయ్ కుమార్ కు ఆ లేఖలో సూచించారు.