ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై సిటీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 305 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో 289 మంది పెద్దలు, 16 మంది మైనర్లు ఉన్నారు. మరో 173 మందికి వారి కుటుంబ సభ్యులతో పాటు కౌన్సెలింగ్ షీ టీం పోలీసులు అందజేశారు.
ఐదుగురు వ్యక్తులకు కోర్టులో హాజరుపర్చారు. వారికి మూడు రోజుల పాటు జైలు శిక్ష, రూ.1050 జరిమానా విధించారు. గత నెలలో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించి 115 కేసులు నమోదు చేశారు. వాటిలో 19 ఎఫ్ఐఆర్ లను వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు చేశారు. నాలుగు కేసులు పోక్సో చట్టం కింద నమోదు చేశారు.