- ప్రజా పాలన దినోత్సవం కాదు ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి
- విమోచన దినోత్సవం జరిపితే మేమూ భాగస్వామలవుతాం
- పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన కేంద్రమంత్రి బండి సంజయ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రహోంశాఖ పూర్వమంత్రి, తెలంగాణ విమోచన కోసం అపరేషన్ పోలో నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెసోడైతే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్ సర్కార్ ను కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ విమోచనం కోసం ఆపరేషన్ పోలో నిర్వహించిన సర్దార్ పటేల్ ను ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ స్మరించిందా? అని నిలదీశారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను జరిపే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. అయితే కాంగ్రెస్ కు మాత్రమే ఆ అర్హత ఉంటే ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో నూ 50 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించారు కదా.. మరి నాటి నుంచి ఎందుకు నిర్వహించలేదని, నాటి తెలంగాణ పోరాట యోధులను ఎందుకు స్మరించలేదు? అని బండి సంజయ్ నిలదీశారు. సెప్టెంబర్ 17న పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజా పాలన కాకుండా ప్రజా వంచన దినోత్సవంగా జరుపుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ తెలంగాణ పోరాటానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కోసం. ఈ సందర్భంగా పరెడ్ గ్రౌండ్స్ లో యువకులతో కలిసి క్రికెట్ ను బండి సంజయ్ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను హింసించిన రజాకార్ల పార్టీతో అంటకాగుతారా? అని ఆయన ప్రశ్నించారు.
జై పాకిస్థాన్, జై పాలస్తీనా అని నినాదాలు చేసిన ఒవైసీని పొగుడుతారా? అని ఆయన నిలదీశారు. నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, హిందూ మహాసభ, ఆర్య సమాజ పోరాటాలను గుర్తుచేసేందుకు రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు మామూలు విషయం కాదన్నారు. రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రిలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని చెప్పారు. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేమని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రధాన కారకులు సర్దార్ వల్లభాయి పటేల్ అని అన్నారు.
ఆనాడు దేశంలోని 562 సంస్థలను విలీనం చేయడానికి హైదరాబాద్ సంస్థను విలీనం చేయడానికి నిజాం అంగీకరించింది. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు స్వాతంత్ర్యం రాకపోతే భారతమాత కడుపులో క్యాన్సర్ గడ్డ అట్లాగే ఉంటుందనే ఉద్దేశంతో ఆఫరేషన్ పోలోతో శస్త్ర చికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్ అని కొనియాడారు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో 1500 మందిని బలిదానం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. ఉద్యమకారుల బలిదానాలతో తీవ్ర భావోద్రేకానికి గురైన సుష్మాస్వరాజ్ ఎవ్వరూ చనిపోవడం లేదని తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి స్వరాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సంగతి మర్చిపోయారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. రజాకార్ల దళానికి వారసుడైన ఒవైసీని సీఎం రేవంత్ రెడ్డి పొగడం వెనుక ఉద్దేశ్యమేమిటని ఆయన నిలదీశారు. జై పాకిస్తాన్ అనేటోళ్ళకు వత్తాసు పలకడమంటే కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట అని ఆయన వ్యక్తపరిచారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్ళి భారత దేశాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.