- సర్కారుపై సమరం
- బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మద్య మళ్లీ మొదలైన రగడ
- రాజకీయాలను వేడెక్కించిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
- టచ్ చేస్తే తడాఖా చూపిస్తామని హెచ్చరించిన కాంగ్రెస్
- తెలంగాణ తల్లి విగ్రహాల పాలాభిషేకాలకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
- భవిష్యత్తుపై ఆసక్తి
- రాజీవ్ విగ్రహావిష్కరణతో మొదలైన పంచాయతీ
- గతంలో అదే తెలంగాణ స్థానంలో తల్లి విగ్రహం
- ఇప్పుడు మార్చిన కాంగ్రెస్
- మళ్లీ పోరుబాటుకు గులాబీ దళం
- ఇటీవల వరుసగా ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్లాన్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- పరస్పరం సవాళ్లు….ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయాలు హీటెక్కిస్తున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీల మధ్య తాజాగా విగ్రహ వివాదం మొదలైంది. ఇది ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య మరింత అగ్గిని రాజేస్తోంది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ ఆయుధంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ యత్నిస్తుండగా….. తెలంగాణ ముసుగులో గులాబీ నేతలు చేస్తున్న రాజకీయ దూకుడుకు కళ్లెం వేసే విధంగా అధికార కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది.దీంతో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకో మలుపు తిరుగుతున్నాయి. హస్తం, గులాబీ పార్టీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో గులాబీ సాధించాలని…. ఆ పార్టీని అదే అంశంతో పాతాళ లోకానికి తొక్కాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలో ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే అనేక పార్టీల బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే దాడులు జరుగుతున్నాయి. శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య నాలుగు రోజుల క్రితం జరిగిన ఘర్షణ ఉదాంతాన్ని ఇంకా ప్రజలు మరవకముందే….తాజాగా విగ్రహ వివాదం రాజుకుంది.
సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగు ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారి…కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. దీంతో రేవంత్ సర్కార్ గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ….నేడు (మంగళవారం) నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని గర్విస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకానికి పిలుపునిచ్చింది. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి….అదే స్థానంలో తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ గులాబీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సర్కార్ భగ్గుమంది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని దమ్ముంటే…టచ్ చేసి చూడండి అంటూ జిల్లా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. దీనితో గులాబీ, హస్తం పార్టీల విగ్రహ రగడ ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకున్నట్లుగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తిని కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. అయితే ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారు.. ఎవరికి ఆశాభంగం కలుగుతుందన్న అంశంపై స్పష్టత రావాలంటే…. స్థానిక సంస్థల ఎన్నికల సమరం వరకు వేచి చూడాల్సిందే.